అలస్కాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు
posted on Jul 17, 2025 @ 11:57AM
అమెరికాలోని తీర ప్రాంత రాష్ట్రమైన అలస్కాలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.3గా నమోదైంది. దీంతో అలస్కా రాష్ట్రానికి సునామీ హెచ్చరికలు జారీ చేస్తూ యూఎస్ జియోలాజికల్ సర్వే ఓ ప్రకటనను విడుదల చేసింది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం (జులై 16) మధ్యాహ్నం 12:37 గంటలకు ఈ భూకంపం సంభవించింది. ముందు జాగ్రత్తగా తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ఈ భూకంపం వల్ల అలస్కా ప్రాంతంలో సంభవించిన ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు ఇంకా బయటకు రాలేదు. అలస్కాకు 20 కి.మీ. దూరంలో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. అలస్కా తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.కాగా, తరచుగా భూకంపాలు వచ్చే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఈ అలస్కా రాష్ట్రం ఉంది. ఇక్కడ తరచుగా భూప్రకంపనలు చోటు చేసుకుంటాయి. అయితే భారీ భూకంపం మాత్రం 1964లో వచ్చింది. అప్పుడు రిక్టర్ స్కేలుపై 9.2 తీవ్రతో భూకంపం సంభవించింది ఆ విపత్తులో ఏకంగా 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.