రాహుల్ కోసం మన్మోహన్ త్యాగానికి సిద్దం
posted on Jun 18, 2013 @ 10:31AM
కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలంటే సోనియా, రాహుల్ భజన తప్పనిసరి అని అందరికి తెలుసు. అయితే, సోనియా గాంధీ ఈ భజన కార్యక్రమానికి బాగా అలవాటుపడినప్పటికీ రాహుల్ గాంధీ మాత్రం దీనికి ఇంకా పూర్తిగా అలవాటుపడలేదు. అలాగని పార్టీలో వారి భజన కార్యక్రమం ఆగిపోలేదు. సాక్షాత్ ప్రధాని డా.మన్మోహన్ సింగ్ కూడా ఈ భజన కార్యక్రమానికి మినహాయింపు కారని మరోమారు ఋజువు చేసుకొన్నారు.
నిన్న మంత్రివర్గ విస్తరణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ “రాహుల్ గాంధీ అన్ని విధాల సమర్దుడయిన యువనేత, జాతీయ నాయకుడు. ఆయన గనుక ప్రధాని పదవి చేప్పట్టదలిస్తే నేను ఆనందంగా తప్పుకొంటాను,”అని అన్నారు. ఆయన ఈవిధంగా మాట్లాడటం కొత్త కాకపోయినప్పటికీ, మళ్ళీ అకస్మాత్తుగా రాహుల్ ప్రధాని పదవి ప్రసక్తి తేవడం చూస్తే, ఆయన కూడా వచ్చే ఎన్నికల తరువాత మళ్ళీ మరోమారు ప్రధాని పదవిలో కొనసాగాలని కోరుకొంటున్నట్లు అర్ధం అవుతోంది. అందుకే ఆయన కూడా రాహుల్ భజన చేసి ఉండవచ్చును.
ఆయన సోనియా, రాహుల్ పట్ల తన విధేయతను మరో మారు బహిరంగంగా ప్రకటించుకోవడం ద్వారా తానూ ఆ పదవిలో వారి దయతోనే కొనసాగుతున్నట్లుగా చెప్పకనే చెప్పారు. వారు అనుమతిస్తే ప్రధాని పదవిలో కొనసాగుతానని లేకుంటే వైదొలగుతానని తెలియజేయడం ద్వారా ఒకవేళ రాహుల్ గాంధీ కనుక వచ్చే ఎన్నికల తరువాత ప్రధాని పదవి అధిష్టించేందుకు అయిష్టత చూపితే తనకు కాకుండా వేరెవరికీ ఆ పదవి కట్టబెట్టకుండా ఉండేందుకే ఆయన తన ఈ విధేయ ప్రకటన చేసారనుకోవచ్చును. లేకుంటే, ఆయన ఇటువంటి అసందర్భ ప్రకటన చేసేవారు కాదు. ఇక ముందు కూడా ఆయన ఇటువంటి ప్రకటన చేసినా ఆశ్చర్యం లేదు. దేశంలో అత్యున్నత పదవిలో కొనసాగాలంటే ఆ మాత్రం శ్రమ తీసుకోక తప్పదు మరి.