రేవంత్ రెడ్డిపై మండలి చైర్మన్ ప్రశంసల వర్షం
posted on Mar 15, 2024 @ 2:53PM
బీఆర్ఎస్ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగం భోట్లు అన్నట్లుగా తయారౌతోంది. తాజాగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి పాలన భేషుగ్గా ఉందంటూ ప్రశంసల వర్షం కురిపించారు. శుక్రవారం (మార్చి 15) మీడియాతో మాట్లాడిన గుత్తా సుఖేందర్ రెడ్డి, తన కుమారుడు అమిత్ కు కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిందిగా ఆ పార్టీ నేతల నుంచి ఆహ్వానం వచ్చిందని చెప్పారు. అంత వరకూ వాస్తవమే కానీ.. ఆ దిశగా ఎటువంటి చర్చలూ జరగలేదని ముక్తాయించారు.
అయితే బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడానికి అమిత్ సుముఖంగా లేరని గుత్తా చెప్పారు. ఇప్పుడు కాదు రెండు నెలల ముందు అమిత్ ను బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఇక తాను పార్టీ మారనున్నట్లు వస్తున్న వార్తలలో వాస్తవం లేదని చెప్పిన ఆయన రాజకీయ పార్టీలకు సంబంధం లేని రాజ్యాంగ పదవిలో ఉన్న తనకు ఏ పార్టీ కండువా కప్పుకోవలసిన అవసరం లేదని చెప్పారు.
తెలంగాణ ప్రజలు రేవంత్ ప్రభుత్వ పని తీరును మెచ్చుకుంటున్నారనీ, ఆయన పాలన బేషుగ్గా ఉందనీ కితాబిచ్చారు. రేవంత్ తనకు బంధువని చెప్పుకున్నారు. అయినా అసెంబ్లీ సమావేశాల్లో తప్ప మరెక్కడా, ఎన్నడూ రేవంత్ తో భేటీ అయిన సందర్భం లేదని స్పష్టం చేశారు. మొత్తం మీద సుఖేందర్ రెడ్డి మాటలను బట్టి చూస్తే ఆయన బీఆర్ఎస్ కు దూరం జరగాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టంగా అవగతమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మొత్తం మీద బీఆర్ఎస్ కు ఇంత కాలం కీలకంగా ఉన్న నేతలు ఒక్కరొక్కరుగా ఆ పార్టీకి దూరం అవుతున్నారు. స్వయంగా పార్టీ అధినేత కేసీఆర్ బుజ్జగించినా ఎవరూ ఆగడం లేదన్నట్లుగా పరిస్థితి ఉంది. తాజాగా దానం నాగేందర్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ తో భేటీ అయ్యారు. ఆయన కూడా నేడో రేపో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఒకప్పుడు మాటే శాసనంగా, కనుసైగతో పార్టీని నియంత్రించిన కేసీఆర్ ఇప్పుడు కాళ్లా వేళ్లాపడి బతిమలాడుతున్నా బీఆర్ఎస్ లో కొనసాగేందుకు ఇష్టపడటం లేదని పరిశీలకులు అంటున్నారు. ఆరూరి ఉదంతాన్ని ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు.