కరోనా.. రెండోసారి
posted on Aug 26, 2020 @ 3:37PM
ప్రపంచమంతా కరోనా కోరల్లో చిక్కకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆ మహమ్మారి నుంచి తప్పించుకోవడం అసాధ్యమే అవుతుంది. లాక్ డౌన్లతో ఇంటికే పరిమితమైనా వదలడం లేదు. కోట్లాది మందికి వ్యాపించి వేలాది మందిని బలితీసుకుంది. లక్షలాది మంది బతుకు జీవుడా అంటూ ఈ వ్యాధి నుంచి బయటపడుతున్నారు. అయితే ఒకసారి వచ్చిన వారికి తిరిగి రెండోసారి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలియడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది.
కొన్నిరోజుల కిందట చైనాలో కరోనా వచ్చి తగ్గిపోయిన ఒక వ్యక్తిలో తిరిగి రెండోసారి వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న 33 ఏళ్ల వ్యక్తికి మళ్ళీ మూడు నెలల తర్వాత ఈ వైరస్ లక్షణాలు బయటపడటంతో పాటు వైద్య పరీక్షల్లో పాజిటివ్ గా నిర్దారించారు. ఆ వ్యక్తికి రెండోసారి సోకినది ఐరోపాలో వ్యాపిస్తున్న మరో రకమైన కోవిద్ వైరస్ అని వైద్య పరీక్షల్లో గుర్తించారు. తాజాగా తెలంగాణలోనూ పాజిటివ్ గా నమోదైన ఒక వ్యక్తికి పూర్తిగా తగ్గిన తర్వాత మరోసారి కరోనా లక్షణాలు కనిపించాయి. ఇది అధికారికంగా ప్రపంచంలో రెండో కేసు. అయితే రెండోసారి కోవిద్ వైరస్ బారిన పడుతున్న కేసులు తెలంగాణలో చాలానే ఉన్నాయని వైద్యఉన్నతాధికారులు అంటున్నారు. అనునిత్యం కోవిద్ సోకిన వారితో కలిసి పనిచేసేవారికి అంటే వైద్యసిబ్బందికి రెండోసారి సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.
లక్షణాల తీవ్రత ఎక్కువగా..
రెండోసారి కరోనా బారిన పడే వారిలో పాజిటివ్ కేసుల్లో బాధితులు కోలుకోవడానికి కనీసం 20 రోజులు పడుతోంది. వారిలో లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మొదటిసారి వాడిన మందుల కంటే అధికమోతాదులో మందులు వాడాల్సి వస్తుందని చెప్తున్నారు.
జాగ్రత్తగా ఉండకపోవడమే...
ఒకసారి వస్తే మళ్లీ రాదు అన్న ధీమాతో చాలామంది కోలుకున్న తర్వాత మాస్క్ ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా తిరుగుతున్నారట. ఇలాంటి అజాగ్రత్తల వల్లనే రెండోసారి కరోనా బారిన పడుతున్నారని వైద్యనిపుణులు వివరిస్తున్నారు.
వైరస్ మ్యూటేషన్ వల్లే..
కోవిద్ 19 వైరస్ అనునిత్యం రూపాంతరం చెందుతూ వేరువేరు లక్షణాలను బహిర్గతం చేస్తుంది. వ్యాక్సిన్ తయారీలోనూ ఆలస్యం కావడానికి ఇదే కారణని పరిశోధకులు అంటున్నారు. ఒకసారి వచ్చిన వారిలో తిరిగి రెండోసారి వస్తుంది అంటే వైరస్ మ్యూటేషన్ వల్లనే .. దీనిపై మరిన్ని ప్రయోగాలు జరగాల్సి ఉందంటున్నారు.
ఏది ఏమైనప్పటికీ కరోనా కష్టం కాలం మరెంత కాలం అన్న విషయంలో స్పష్టత కాకముందే రెండోసారి వస్తుందన్న వార్త కలవరం కలిగిస్తోంది. మందులు, వ్యాక్సిన్లు కంటే వ్యక్తిగత జాగ్రత్తే కరోనా కట్టడికి దివ్యౌమంత్రం. మాస్క్ ధరిస్తూ భౌతిక దూరం పాటిస్తూ ఆరోగ్యకరమైన నియమాలను పాటించాల్సిందే..