Read more!

ఇంట్లో ఎలుకల మందు పెడుతున్నారా?.. జగ్రత్త జైలు పాలౌతారు!

ఇంట్లో ఎలుకలు తిరుగుతుంటే.. ఆ ఇల్లాలికి భయం చిరాకు వెంటాడుతుంటాయి. వాషింగ్ మిషన్ నుంచి అన్నిటినీ కొరికి పెట్టేసి పాడు చేయడమే కాకుండా.. అల్మార్లలో స్టోర్ చేసుకున్న పప్పులనూ వదలకుండా పాడు చేస్తుంటాయి.

ఇక బట్టల సంగతి అయితే చెప్పనే అవసరం లేదు. చింపి పోగులు చేస్తుంటాయి. పారాడే వయస్సున్న చిన్నపిల్లలు ఉన్న ఇళ్లల్లో అయితే ఎలుకలతో మరీ ఇబ్బంది. వీటన్నిటినీ అధిగమించడానికి ఇళ్లల్లో ఎలుకల బోన్లు పెడతాం. దానివల్లా లాభం లేదనుకుంటే ఎలుకల మందు పెట్టి ఎలుకలను చంపేస్తాం. అలా చంపేసినందుకు హత్య కేసు పెడతామంటూ పోలీసులు వస్తే... అదే కనుక జరిగితే దేశంలో జైళ్లలో కాకుండా బయట ఉండే వారి సంఖ్య చాలా తక్కువ అయిపోతుందనడంలో సందేహం లేదు.

ఇంత ఉపోద్ఘాతమేమిటని అనుకుంటున్నారా.. ఎలుకను చంపాడని చెప్పి ఓ వ్యక్తిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆశ్చర్యం వద్దు ఇది నిజమే.. ఉత్తర ప్రదేశ్ లో మనోజ్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడు చేసిన నేరం ఎలుకను హత్య చేయడమే. ఓ ఎలుక తోకకు రాయి కట్టి నీటిలో ముంచి చంపేశాడంటూ అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు మనోజ్ కుమార్ ను అరెస్టు చేశారు. ఎలుక శవాన్ని పోస్టు మార్టం కోసం పంపారు. ఈ మొత్తం వ్యవహారం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఎలుకను హత్య చేసినందుకు మనోజ్ కుమార్ కు జీవిత ఖైదు విధిస్తారా, లేక ఉరి వేస్తారా అంటూ నెటిజనులు జోకులు పేలుస్తున్నారు.