Read more!

బండి ఐదో విడత పాదయాత్ర అడుగు కదపనివ్వమంటున్న పోలీసులు.. నడిచి తీరుతాం అంటున్న బీజేపీ శ్రేణులు

తెలుగు రాష్ట్రాలలో పాదయాత్రలు ఉద్రిక్తతలు సృష్టిస్తున్నాయి. అమరావతి రైతుల పాదయాత్రలో సంభవించిన ఉద్రిక్త పరిణామాలు మరుపనకు రాకముందే.. తెలంగాణలో బండి సంజయ్ పాదయాత్ర ఐదో విడత ప్రారంభానికి ముందే యుద్ధ వాతావరణం ఏర్పడింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర సోమవారం(నవంబర్ 28)  నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. ఆదిలాబాద్ జిల్లా భైంసా నుంచి యాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా ఆదివారం (నవంబర్ 27) నుంచే పోలీసులు భైంసాను తమ అధీనంలోకి తీసుకున్నారు.

యాత్రకు అన్ని ఏర్పాట్లూ చేసుకున్న బండి సంజయ కు తీరిగ్గాఅప్పుడు అనుమతి నిరాకరిస్తున్నట్లు పేర్కొన్నారు. భైంసాలో నెలకొన ఉన్న సున్నిత పరిస్థితుల కారణంగా యాత్ర కొనసాగిస్తే.. ఉద్రిక్తతలు పెచ్చరిల్లి షర్ఫణలు జరిగే ప్రమాదం ఉందని చెబుతూ పోలీసులు యాత్రకు అనుమతి నిరాకరించారు.  శాంతిభద్రతల దృష్ట్యా అనుమతి ఇవ్వడం లేదని ఆదిలాబాద్ జిల్లా పోలీసులు ప్రకటించారు. అయితే బీజేపీ నేతలు మాత్రం యాత్ర కొనసాగించి తీరుతామని స్పష్టం చేశారు.

గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాదయాత్ర సాగుతున్నప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని పోలీసులు .. పాదయాత్ర అనుమతి రద్దు చేసి.. బండి సంజయ్ ను కరీంనగర్‌ తీసుకు వెళ్లి ఇంట్లో వదిలి పెట్టిన సంగతి విదితమే.  అప్పట్లో  హైకోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకుని మరీ బండి సంజయ్ పాదయాత్ర కొనసాగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఐదో విడత పాదయాత్రకు  అదే సీన్ రిపీట్ అయ్యింది. పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా బండి సంజయ్ పాదయాత్ర  చేయడం ఖాయమని బీజేపీ వర్గాలు స్పష్టం చేశాయి.

అయితే పోలీసులు పూర్తి స్థాయిలో కట్టడి చేయడానికే నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే భైంసాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే  కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థల దూకుడుతో రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. భైంసా నుంచి బండి పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో అక్కడి పరిస్థితులు ప్రత్యక్ష యుద్ధం జరుగుతోందా అన్నట్లుగా మారిపోయాయి.  ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేశారు. బండి భైంసాకు వెళుతుండగా మార్గ మధ్యంలో జగిత్యాల మండలం తాటిపల్లి వద్ద అడ్డుకుని యాత్రకు అనుమతి లేదని ముందకు వెళ్లేందుకు వీళ్లేదనీ స్పష్టం చేశారు.

అయితే బండి పోలీసులను ఖాతరు చేయకుండా వారిని తప్పించుకుని ఓ కార్యకర్త వాహనంలో భైంసా వైపు దూసుకెళ్లారు. ఈ దశలో బీజేపీ కార్యకర్తలు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడమే కాక తోపులాటల వరకూ వెళ్లింది. అయితే పోలీసులు బండిని వెంబడించి కోరుట్ల మండలం వెంకటాపురం వద్ద నిలిపివేశారు. ఈ సందర్భంగా బండి పోలీసులతో వాగ్వాదానికి దిగారు.  రోడ్డుపైనే కార్యకర్తలతో కలిసి ధర్నాకు కూర్చున్నారు. దీంతో పోలీసులు బండి సంజయ్ ను అరెస్టు చేసి జగిత్తాలకు తరలించారు.  బండి పాదయాత్రకు అనుమతి నిరాకరించడం, బండిని అరెస్టు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి.

రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందంటూ విమర్శలు గుప్పించాయి. భైంసా, నిర్మల్, జగిత్యాలలో ఏ క్షణాన ఏం జరుగుతుదో అన్నంతగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒక వైపు బండి సంజయ్ ను పోలీసులు జగిత్యాలలో గృహ  నిర్బంధంలో ఉంచారు. మరో వైపు పాదయాత్రకు అనుమతి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ బీజేపీ హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది.  ఇప్పటి వరకూ రాష్ట్రంలో బండి సంజయ్ నాలుగు విడతల్లో 21 జిల్లాలలో 1178 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేసిన సంగతి విదితమే.