ఇండియా కూటమికి కంట్లో నలుసుగా మమతాబెనర్జీ
posted on May 30, 2024 @ 2:24PM
దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు వచ్చేశాయి. చివరి విడత పోలింగ్ జూన్ 1 అంటే శనివారం జరుగుతుంది. ఆ తరువాత మూడు రోజులకు అంటే జూన్ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి జరుగుతుంది. ఇప్పటి వరకూ జరిగిన ఆరు విడతల పోలింగ్ సరళిని బట్టి చూస్తూ బీజేపీ ఘనంగా చాటుకుంటున్నట్లు సొంతంగా కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టడానికి అవసరమైన స్థానాలు సాధించే అవకశాలు దాదాపుగా లేవనే అంటున్నారు. దీంతో కేంద్రంలో వచ్చేసి అచ్చమైన సంకీర్ణ ప్రభుత్వమేనన్న అంచనాలు ఉన్నాయి. మోడీ నేతృత్వంలో 2014, 2019 ఎన్నికలలో కూడా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పాటైనా..అప్పుడు బీజేపీకి తిరుగులేని ఆధిక్యత లభించింది. సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థానాలోలో బీజేపీ విజయం సాధించింది. అయితే ఈ సారి బీజేపీకి ఆ స్థాయి బలం ఉండదన్న అంచనాల నేపథ్యంలో అందరి దృష్టీ కూడా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిపై పడింది.
వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే అయితే..అంటే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మిత్రపక్షాల మీద ఆధారపడే పరిస్థితే వస్తే.. మోడీ బలహీనపడినట్లేననీ, అప్పుడు ఎన్డీయేలోని మిత్రపక్షాలు తమ డిమాండ్ల సాధన కోసం బలంగా గళమెత్తే అవకాశాలుంటాయనీ, అలాంటి పరిస్థితే ఉంటే చాలా వరకూ ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమివైపు చూసే అవకాశాలు మెరుగౌతాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇంతటి సానుకూల పరిస్థితుల్లో కూడా ఇండియా కూటమికి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తీరు కంట్లో నలుసుగా మారింది. కూటమి విషయంలో ఆమె ధోరణి వింతగా ఉంది. దేశంలో తనంత మోడీ వ్యతిరేకి లేరని చెప్పుకుంటూనే.. మోడీ సర్కార్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగిన ఇండియా కూటమితోనూ సఖ్యతగా ఉండటం లేదు.
ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా ఇండియా కూటమిని ప్రతిపాదించింది తానేనని చెప్పుకుని జబ్బలు చరుచుకునే మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ లో మాత్రం ఇండియా కూటమి భాగస్వామిగా అంగీకరించరు. అయితే గియితే, అవసరం వస్తే తాను బయట నుంచి ఇండియా కూటమికి మద్దతు ఇస్తానని చెబుతున్నారు. ఆమె ఈ వైఖరే విపక్ష కూటమికి ఒకింత ఇబ్బందిగా మారింది. అదే సమయంలో ఎన్డీయే కూటమికి బలం చేకూర్చేలా ఉంది. కూటమి విషయంలో మమతా ద్వంద్వ వైఖరి కారణంగానే నితీష్ కుమార్ బీజేపీ పంచన చేరి ఎన్డీయే గూటికి చేరిపోయారని రాజకీయ పండితులు చెబుతున్నారు. అసలు మమతా బెనర్జీ అయినా, నితీష్ కుమార్ అయినా ఇండియా కూటమి సారథ్యాన్ని కోరుకున్నారనీ, అయితే కూటమిలో అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ అందుకు అడ్డుపడుతున్నదన్న భావనతోనూ వారీ వైఖరి తీసుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.