నా మాటంటే మాటే! నన్నెదిరించే వారెవ్వరూ...
posted on Aug 18, 2012 8:59AM
జడ్జీలు డబ్బులు తీసుకుని తీర్పులు ఇస్తున్నారంటూ న్యాయవ్యవస్థపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెపై అటు సుప్రీంకోర్టులోను, ఇటు హైకోర్టులోను కోర్టు ధిక్కరణ కేసులు దాఖలయ్యాయి. దీనిపై మమతా బెనర్జీ స్పందిస్తూ తాను కేవలం విలువలతో కూడిన న్యాయవ్యవస్థ, మీడియా గురించే మాట్లాడాననీ, అయితే` మీడియానే తన మాటలను వక్రీకరించిందని ఆరోపించారు. ఒకవేళ అదే తప్పయితే ఒక్కసారి కాదు, వెయ్యిసార్లయినా అదే వ్యాఖ్యలు చేస్తానని చెప్పడం గమనార్హం.
మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలకు ఆమెపై కోర్టు ధిక్కరణ చర్య తీసుకోవాలంటూ సీనియర్ న్యాయవాది బికాష్ భట్టాచార్య మౌఖికంగా చేసిన అభ్యర్ధనను కోలకతా హైకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఈ మధ్యకాలంలో చాలామంది రాజకీయనేతలకు ముందు వ్యాఖ్యలు చేయడం ఆపైన లేదు నేను అలా అనలేదు అదంతా వక్రీకరించారు అనడం పరిపాటైపోయింది. అయితే ఇక్కడ మమతాబెనర్జీ తాను కేవలం విలువలతో కూడిన న్యాయవ్యవస్థ, మీడియా గురించే మాట్లాడాననీ, అదే తప్పయితే వెయ్యిసార్లయినా అదే వ్యాఖ్యలు చేస్తానని చెప్పడం ఫైర్‌బ్రాండ్ అన్న పేరును సార్ధకం చేసుకున్నా, ఎన్నో ఉన్నత పదవుల్లో కొనసాగి, నేడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ఓ పార్టీకి అధినేతగా కొనసాగుతూ ఎంతో అనుభవం ఉండి, ఆచితూచి మాట్లాడుతూ, పరిపాలన చేయవలసిన ఓ నేతే అలా మాట్లాడారని చెబుతుంటే ఇక సామాన్యులకు ఆయా వ్యవస్థలపై నమ్మకం పోతుంది. అంతేకాదు భవిష్యత్‌లో ఆయా నేతలపై కూడా ఘాటైన వ్యాఖ్యలు వచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఎంతగా ‘నేనంటే నేనే... నా మాటంటే మాటే..నన్నెదిరించే వారెవ్వరు...’ అంటూ ఓ సినీగీతంలా ఈ మాటలు అన్నా భవిష్యత్‌లో ఇటువంటి మాటలే ఆమె పాలనపై, ఆమెపై వస్తే పరిస్థితి ఏమిటన్నది ఆలోచించాల్సిన విషయం!