మమతా బెనర్జీని చంపడానికి కుట్ర జరిగిందా?
posted on Apr 19, 2014 @ 11:56AM
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని చంపడానికి కుట్ర జరిగిందా? అవును కుట్ర జరిగింది అని మమతా బెనర్జీతోపాటు తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు కూడా అంటున్నాయి. గురువారం నాడు ఎన్నికల ప్రచారంలో వున్న మమతా బెనర్జీ ఒక హోటల్‌లో బస చేశారు. ఆమె తన హోటల్ రూమ్‌లో వుండగా ఏసీ కాలిపోయి హోటల్ రూమ్ మొత్తం పొగలు వ్యాపించాయి. మమతా బెనర్జీ ప్రాణభయంతో కేకలు వేశారు. సమయానికి ఆమె సహాయకులు స్పందించి మమతా బెనర్జీని కాపాడారు. ఏసీ కాలిపోవడానికి షార్ట్ సర్క్యూట్ కారణమని పోలీసులు ప్రాథమిక దర్యాప్తు తర్వాత చెప్పారు. అయితే మమతా బెనర్జీ మాత్రం ఇది తనను చంపటానికి జరిగిన కుట్రేనని అంటున్నారు. ఈ సంఘటన మీద సీబీఐతో విచారణ జరిపించాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే మమత అంటే గిట్టని రాజకీయ వర్గాలు మాత్రం అనుకోకుండా జరిగిన సంఘటనని తన రాజకీయ లబ్ది కోసం ఉపయోగించుకోవడానికి మమత ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు.