టీ సర్కార్ పై మధుయాష్కీ ఫైర్.. కవిత సాయం అంటే కేసీఆర్ విఫలమా?
posted on Oct 13, 2015 @ 1:03PM
కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మధు యాష్కీకి ఉన్నట్టుండి ఏమైందో తెలియదు కాని ఒక్కసారిగా తెలంగాణ అధికార పార్టీపై నిప్పులు చెరిగారు. రాహుల్ టీంతో క్లోజ్ గా ఉంటూ రాజకీయాలు చేసే మధుయాష్కీ రాష్ట్రం విడిపోయిన తరువాత పెద్దగా నోరు విప్పిన దాఖలాలు లేవు. ఎన్నికల్లో ఓడిపోయి.. ఆతరువాత సైలెంట్ ఉంటూ.. కనీసం అధికార పార్టీని కూడా విమర్శించే వారు కాదు. అలాంటిది.. ఇప్పుడు అందరూ తనని మరిచిపోతున్నారు అని అనుకున్నారేమో ఉన్నట్టుంది కేసీఆర్ పార్టీపై దుమ్మెత్తిపోశారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన కుమార్తె.. ఎంపీ కవిత.. మేనల్లుడు హరీశ్.. మంత్రి పోచారం..పై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై కేసీఆర్ ఏం పట్టన్నట్టు వ్యవహరిస్తున్నారని.. రైతులు పిట్టల్లా రాలిపోతున్నారని మండిపడ్డారు. రైతు ఆత్మహత్యలపై కేసీఆర్ కూతురు జాగృతి సంస్ధ ద్వారా సాయం చేయడానికి ముందుకొచ్చారు.. అంటే కేసీఆర్ ప్రభుత్వం ఏం చేయలేదని ఒప్పుకుందా అని ప్రశ్నించారు. అంతేకాదు రైతుల ఆత్మహత్యలపై మంత్రి పోచారం కూడా అబద్దాలు ఆడుతున్నారని ఎద్దేవ చేశారు. ఒకపక్క రైతు ఆత్మహత్యలతో వారి భార్యల పసుపుతాళ్లు తెగిపోతుంటే మరోపక్క కవిత బతకమ్మ ఆడుతూ తిరుగుతుందని అన్నారు. అంతేకాదు కవిత లాక్మే షోరూంలు పెట్టుకున్నారు.. మంత్రి హరీశ్ రావు.. ఆంధ్రా వ్యాపారులతో కలిసి టూవీలర్ వెహికిల్స్ బిజినెస్ చేస్తున్నారని విమర్శించారు. మొత్తానికి చాలా రోజులకి నోరు విప్పిన మధుయాష్కీ ఇన్నీ రోజులదంతా ఒకేసారి వెళ్లగక్కినట్టున్నారు.