అమిత్ షాతో లోకేష్ ఆదివారం భేటీ.. విషయం అదేనా?
posted on Oct 22, 2024 @ 10:30AM
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ, మానవవనరుల శాఖ మంత్రి అయిన నారా లోకేష్.. రాజకీయాలలో తనదైన ముద్ర వేశారు. వేస్తున్నారు. సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటిగా అమలు చేస్తూ ప్రజాదరణ పొందుతున్నారు. లోకేష్ మాట ఇచ్చారంటే చేసి తీరుతారన్న విశ్వాసం జనంలో వ్యక్తం అవుతోంది.
తాజాగా నారా లోకేష్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిపిన భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి కీలక అంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చాయన్న ప్రచారం జరుగుతోంది. పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ రెడ్ బుక్ ఇప్పుడు ఓపెన్ అయ్యింది. అందులో భాగంగానే తెలుగుదేశం కూటమి సర్కార్ దాదాపు 16 మంది ఐఏఎస్. ఐపీఎస్ లకు పోస్టింగులు ఇవ్వలేదు. వీరంతో జగన్ హయాంలో నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారీతిగా వ్యవహరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే. వీరందరిపై కేంద్రం అనుమతితో చట్ట ప్రకారం చర్యలకు చంద్రబాబు సర్కార్ సిద్ధమౌతోంది. ఈ నేపథ్యంలోనే లోకేష్ అమిత్ షా భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
సాధారణంగా అమిత్ షా ఆదివారాలు రాజకీయ నేతలెవరికీ అప్పాయింట్ మెంట్ ఇవ్వరు. అయితే లోకేష్, అమిత్ షా భేటీ ఆదివారమే జరగడంతో ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అమిత్ షాతో భేటీ అనంతరం లోకేష్ చేసిన ఒక ట్వీట్ వీరి భేటీ ఫలవంతమైందన్న సంకేతాలు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నందుకు అమిత్ షాకు కృతజ్ణతలు తెలుపుతూ లోకేష్ ట్వీట్ చేశారు. ఈ భేటీలో లోకేష్ ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగులు ఇవ్వకుండా పక్కన పెట్టిన ఆరోపణలను ఎదుర్కొంటున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు జగన్ హయాంలో వ్యవహరించిన తీరును వివరించినట్లు తెలుస్తోంది. ఈ అధికారులపై ఉన్న కేసులను వివరించి, వారిపై చర్యలకు తెలుగుదేశం కూటమి కట్టుబడి ఉందన్న తెలిపారని అంటున్నారు. అందుకు అమిత్ షా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఇక్కడ చెప్పుకోవలసిన మరో విషయమేమిటంటే లోకేష్ అమిత్ షాతో భేటీ కావడం దాదాపు ఏడాది తరువాత ఇదే మొదటి సారి. దాదాపు సంవత్సరం కిందట, అంటే చంద్రబాబును జగన్ సర్కార్ స్కిల్ కేసు అంటూ అక్రమంగా అరెస్టు చేసినప్పుడు లోకేష్ హస్తిన వెళ్లి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విత్ హెల్డ్ లో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపై చట్టపరంగా తీసుకునే చర్యలకు అమిత్ షా మద్దతు తెలిపారని అంటున్నారు. అమిత్ షా, లోకేష్ ల భేటీతో వైసీపీ వర్గాలలో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. రెడ్ బుక్ ఓపెన్ అయ్యిందనీ, ఇప్పుడిక చర్యల ఉంటాయన్న సంకేతాన్ని ఈ భేటీ ఇచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.