రంగంలోకి దిగిన లోకేష్

 

తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ సంక్రాంతి సందర్భంగా చిత్తూరు జిల్లాలో తమ స్వగ్రామమయిన నారావారి పల్లెకు వచ్చినప్పుడు, తన రాజకీయ కార్యక్రమాలను కూడా ఆరంభించాడు. పండుగ సంభారాలలో మునిగున్న తెలుగు తమ్ముళ్ళకు నారా లోకేష్ స్వయంగా తమను కలవడం వారికి మరింత ఆనందం కలిగించింది.

 

పార్టీ అధ్యక్షుడే స్వయంగా జిల్లాకు ప్రాతినిద్యం వహిస్తున్నపటికీ, గత కొంత కాలంగా జిల్లా వైపు కన్నెత్తి చూడడానికి కూడా తీరికలేని రాజకీయాలలో తలమునకలవుతున్న కారణంగా, తెలుగుదేశం కార్యకర్తలలో మునుపటి ఉత్సాహం కొరవడింది.ఆకారణంగా కొందరు పార్టీ నేతలు, కార్యకర్తలూ క్రమంగా ఇతర పార్టీలవైపు ఆకర్షితులవుతున్న సంగతి తెలియడంతో యువనేత లోకేష్ జిల్లారాజకీయాలపై తన దృష్టి సారించాడు.

 

లోకేష్ స్థానిక నేతలతో, పార్టీ కార్యకర్తలతో దఫా దఫాలుగా అనేక సార్లు సమావేశం అయ్యాడు. జిల్లాలో పార్టీ పరిస్థితిని తెలుసుకోనడమే గాకుండా వారి అభిప్రాయాలను, సూచనలను ఎప్పటికప్పుడు తన ల్యాప్ టాప్ కంప్యుటర్ లో నోట్ చేసుకొన్నట్లు సమాచారం.

 

స్థానిక నేతలు, అతనితో నియోజక వర్గ ఇన్-చార్జుల నియామకాల గురించి ప్రస్తావించినప్పుడు,మరొక నెల, నెలన్నర సమయంలో చిత్తూరు మరియు తెలంగాణ జిల్లాలలో అన్ని నియోజక వర్గాలకు ఇన్-చార్జుల నియామక ప్రక్రియ పూర్తీ చేయనున్నట్లు లోకేష్ తెలిపాడు.

 

ఈ సమావేశాలలో అతను ముఖ్యంగా తంబళ్లపల్లి, చంద్రగిరి,పుంగనూరు, పీలేరు, పీలేరు నియోజకవర్గాలలో పార్టీ పరిస్థితులపై ప్రత్యేక శ్రద్ద కనబరుస్తూ పూర్తీ వివరాలను సేకరించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, గతంలో ఈ నియోజకవర్గాలలో పార్టీ అధిష్టానం మరియు స్థానికనేతల మధ్య సరయిన అనుసంధానం జరగకపోవడం చేత తీవ్రమయిన తప్పిదాలు కొన్నిజరిగి, తద్వారా పార్టీకి కూడా తీవ్ర నష్టం జరిగిందని పేర్కొంటూ, ఇక ముందు అటువంటి పొరపాట్లు పునారావృతం కాకుండా తానూ శ్రద్ధ తీసుకొంటానని చెప్పడంతో పార్టీ నాయకులూ సంతోషం వ్యక్తం చేసారు.

 

ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా లోకేష్ స్వయంగా ఈ విధంగా చొరవ తీసుకొని స్థానిక నేతలతో, మమేకం కావడం జిల్లాపార్టీ శ్రేణులు చాలా ఉత్సహంగా ఉన్నారు.

Teluguone gnews banner