భారతరత్న ఇవ్వడం పట్ల అద్వాణి ఆనంద భాష్పాలు
posted on Feb 3, 2024 @ 3:22PM
బిజెపి అగ్రనేత , రాజకీయ కురు వృద్దుడు ఎల్ కె అద్వాణి కంట తడి పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. బిజెపి ప్రభుత్వం పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ అద్వాణికి భారతరత్న ఇవ్వలేకపోయింది. రానున్న లోకసభ ఎన్నికల నేపథ్యంలో అద్వాణికి ఈ పురస్కారం ఇవ్వడం బిజెపి శ్రేణులలో ఆనందోత్సహాలు వ్యక్తమవుతున్నాయి. తనకు దక్కిన ఈ అరుదైన పురస్కారానికి అద్వాణి ఆనందబాష్పాలు రాల్చారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్టాపనకు స్వయంగా రామజన్మభూమి ట్రస్ట్ సభ్యులు వచ్చి ఆహ్వనించినప్పటికీ విపరీతమైన చలికారణంగా అద్వాణి రాలేకపోయారు.బీజేపీ అగ్రనేత అద్వానీని దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నకు భారత ప్రభుత్వం ఎంపిక చేయడం పట్ల ఈ సందర్భంగా అద్వానీ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అత్యంత వినయంతో, కృతజ్ఞతతో భారతరత్న పురస్కారాన్ని తాను స్వీకరిస్తున్నానని చెప్పారు. ఈ పురస్కారం తన ఆదర్శాలు, అనుసరించిన సిద్ధాంతాలకు దక్కిన గౌరవమని అన్నారు. ఇది కేవలం ఒక వ్యక్తిగా మాత్రమే కాదని... తన జీవిత ప్రయాణంలో తన సామర్థ్యానికి తగినట్టుగా చేసిన సేవలకు, పాటించిన ఆదర్శాలకు దక్కిన గౌరవమని చెప్పారు.
తనకు భారతరత్నను ప్రకటించిన సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అద్వానీ అన్నారు. తన కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తనకు భౌతికంగా దూరమైన తన భార్య కమల తనకు బలమని చెప్పారు. 14 ఏళ్ల వయసులో ఆరెస్సెస్ లో చేరినప్పటి నుంచి... దేశం కోసం తన జీవితం తనకు అప్పగించిన ప్రతి పనిని స్వలాభాన్ని చూసుకోకుండా, శక్తివంచన లేకుండా నిర్వహించానని తెలిపారు.
తనకు భారతరత్న వచ్చిన సందర్భంగా... ఎవరితోనైతే పని చేయడాన్ని తాను గౌరవంగా భావించానో ఆ ఇద్దరినీ సగౌరవంగా తలుచుకుంటున్నానని... వారు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి అని అద్వానీ చెప్పారు. బీజేపీ శ్రేణులకు, స్వయంసేవకులకు కూడా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.
మరోవైపు, అద్వానీకి భారతరత్న ప్రకటించిన తర్వాత ఆయన ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. అద్వానీకి ఆయన కుమార్తె ప్రతిభా అద్వానీ స్వీటు తినిపించి సంబరాలు జరుపుకున్నారు. భారతరత్న వరించిన విషయం తెలిసిన తర్వాత అద్వానీ కంటతడి పెట్టుకున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.