Read more!

చుక్కలనంటిన చుక్కధర

 

 


మందు బాబులకు దిమ్మ తిరిగేలా ప్రభుత్వం మద్యం ధరలను పెంచేసింది. ప్రీమియం, మీడియం బ్రాండ్ల మద్యం ధరలను పెంచుతూ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి అసుతోష్ మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. ఎక్సైజ్ డ్యూటీ, ట్రేడ్ మార్జిన్ పెంచడంతో, సర్కారుకు దాదాపు వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశాలున్నాయి. ఈ మార్పులు శనివారం నుండి అమల్లోకి వస్తాయి.



ఎక్సైజ్ డ్యూటీ లో పెద్దగా మార్పులు లేవు. అయితే, బేసిక్ ధర రూ.400 నుండి రూ. 450 వరకూ రేంజ్ ను సృష్టించి ప్రూఫ్ లీటర్ కు రూ. 75 చొప్పున ఎక్సైజ్ డ్యూటీ ని విధించింది. ఈ నిర్ణయం వల్ల క్వార్టర్ బాటిల్ ధర రూ.4 నుండి రూ.  5 వరకూ పెరగనుంది. మధ్య తరగతి ప్రజలే ఎక్కువగా ఇలాంటి మద్యాన్ని తాగుతుంటారు.


అయితే, ఇప్పటికే వ్యాపారుస్తుల వద్ద ఉన్న మద్యాన్ని పాత ధరలకే విక్రయించాల్సి ఉంటుంది. రేపటి నుండి ఏపిబిసిఎల్ డిపోల నుండి తీసుకువెళ్ళే మద్యానికి మాత్రం కొత్త ధరలు వర్తిస్తాయి. పాత సరుకును మారిన ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దేవేంద్ర సింగ్ స్పష్టం చేశారు. ఈ విషయంలో వినియోగదారులు 040-24612756, 9966222271 నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని అయన అన్నారు.

హైదరాబాద్ సిటిలో సుమారు 130 మద్యం దుకాణాలు ఉంటే, నగరం నుండి దాదాపు 700 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. కొత్త సంవత్సర వేడుకలకు సిద్దమవుతన్న మందు బాబులు ధరలు పెరగడంతో ఒక్కసారిగా ఖంగు తిన్నారు. మద్యం వ్యాపారుల వత్తిడులకు తలొగ్గే ఈ ధరలను పెంచారని తెలుగు దేశం నేత దాడి వీర భద్ర రావు విమర్శించారు. ధరలు పెరగడం వల్ల వీటికి అలవాటు అయిన పేదలు నాటు సారాను తాగి ప్రాణాలు పోగొట్టుకొనే అవకాశం ఉందని ఆయన అన్నారు.