కుప్పం సంఘటన అంత పెద్దదేం కాదు.. డిజిపీ రాజేంద్రనాధ్ రెడ్డి
posted on Sep 2, 2022 @ 8:42PM
కుప్పం ఘటన శాంతిభద్రతలను ఇబ్బందిపెట్టేంత పెద్దదికాదని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియా తో మాట్లాడుతూ కుప్పం ఘటనలో పాల్గొన్నవారు స్థానికులేనని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు )కు ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీ పెంచడం, తగ్గించడం అనేది.. వచ్చే ఇన్‌పుట్స్‌పై ఆధారపడి ఉంటుందన్నారు.
సెక్యూరిటీ పెంచడం, తగ్గించడంలో నిజాలు ఎంతో తెలియదని చెప్పారు. ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై సీఐడీ విచారిస్తోందని తెలిపారు. సెప్టెంబర్ 11న సీపీఎస్ ఉద్యోగుల సమ్మెపై ఎలాంటి విజ్ఞప్తి రాలేదని తెలిపారు. అభ్యర్థన వచ్చాకా అనుమతివ్వాలా.. వద్దా అనేది చెబుతామన్నారు. ఉద్యోగులను అరెస్ట్ చేయలేదని బైండోవర్ చేశామని రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. కుప్పంలో టీడీపీ నేతలు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని, రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో కుప్పంలో కేసులు నమోదు చేశామని చిత్తూరు ఎస్పీ తెలిపారు.
ఆరోజు మంగళగిరిలో తెదేపా శ్రేణులు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రధాన ద్వారాన్ని తోసుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. నల్లజెండాలు, తెదేపా జెండాలతో గేటు వద్దే అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో బైఠాయిం చి నిరసన వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ నుంచి డీజీపీ కార్యాలయానికి అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు.
కుప్పంలో చంద్రబాబుని అడ్డుకునే యత్నం, అన్న క్యాంటీన్‌పై దాడిని నిరసిస్తూ అచ్చెన్నాయుడు.. డీజీపీ కార్యాలయానికి కాలినడకన వెళ్లారు. అచ్చెన్నాయుడు వెంట పీతల సుజాత, ఎం.ఎస్. రాజు, తెనాలి శ్రావణ్ కుమార్, నాదెండ్ల బ్రహ్మం, ఇతర తెదేపా నేతలు నిరసనగా బయలుదేరారు. డీజీపీ కార్యాలయం గేటు ఎక్కి దూకేందుకు తెదేపా శ్రేణులు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు.