తెలుగుదేశంపై మారిన కేటీఆర్ స్వరం.. పూర్తిగా యూటర్న్!
posted on Nov 6, 2023 @ 9:57AM
తెలంగాణ ఎన్నికలలో తెలుగుదేశం పోటీ చేసినా.. పోటీ చేయకపోయినా ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రస్తావన లేకుండా ఎన్నికలు మాత్రం పూర్తి కావు. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ నేతలు తెలుగుదేశంకు వ్యతిరేకంగానో, చంద్రబాబుకు అనుకూలంగానో వ్యాఖ్యలో, ప్రస్తావనో లేకుండా ఎన్నికలు పూర్తి కావు. రాష్ట్ర విభజన తరువాత నుంచీ జరిగిన ప్రతి ఎన్నికలోనూ రావడం మాత్రం ఖాయం. సీఎం కేసీఆర్ ఆంధ్రా పార్టీలన్నిటినీ కలిపి విమర్శిస్తే ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్ మాత్రం పదేపదే చంద్రబాబు పాలనను గుర్తు చేయడం, హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబుకు క్రెడిట్ ఇవ్వడం చేస్తూ ఆంధ్రా సెటిలర్ల ఓటర్లను తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తుంటారు. కేసీఆర్ అండ్ కో రాజకీయంగా తెలుగుదేశం పార్టీని ప్రత్యర్థి పార్టీగానే..ఎప్పటికైనా రాష్ట్రంలో తమకు ప్రత్యామ్నాయం కాగల పార్టీగానే చూస్తారనీ, చూస్తున్నారనీ పరిశీలకుల విశ్లేషణ. అందుకే 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో పరోక్షంగా వైసీపీ విజయం కోసం టీఆర్ఎస్ పార్టీ పనిచేసిందన్నది బహిరంగ రహస్యమే. తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి నేతలైతే ఏపీలో వైసీపీ సభలకు కూడా హాజరయ్యారు. చంద్రబాబును ఓడించి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ గత ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) ముఖ్యనేతలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేయగా.. అదే సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో చెట్టాపట్టాలేసుకుని రాజకీయాలు నడిపించారు. అయితే అదంతా గతం.
కేసీఆర్ టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ గా మార్చిన అనంతరం ఏపీలో వైసీపీతో సంబంధాలను పక్కన పెట్టేశారు. అలాగని తెలుగుదేశం పార్టీకి దగ్గరైంది కూడా లేదు. పైగా ఏపీలో కూడా బీఆర్ఎస్ బ్రాంచి పెట్టి ఎన్నికలలో కూడా పోటీ చేస్తామని చెప్పారు. అయితే ఈలోగా తెలంగాణలో ఎన్నికల సమయం ముంచుకొచ్చింది. దీంతో బీఆర్ఎస్ నేతలు ప్రస్తుతానికి ఏపీ రాజకీయ వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం లేదు. అయితే అనూహ్యంగా చంద్రబాబు అరెస్ట్ రూపంలో బీఆర్ఎస్ కు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. చంద్రబాబు అరెస్టుపై హైదరాబాద్ లోని ఆంధ్రా సెటిలర్లు, ఐటీ ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. దీనిపై మంత్రి కేటీఆర్ ఆగ్రహించారు. అది కాస్తా ఆంధ్రా సెటిలర్లకు కోపం తెప్పించింది. అప్పటికప్పుడు కేటీఆర్ తన వ్యాఖ్యల వల్ల జరిగిన నష్టాన్నిపూడ్చుకునేందుకు నష్ట నివారణ చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. అసలే గత పదేళ్లుగా తెలుగుదేశంపై బీఆర్ఎస్ వైఖరి, గత ఎన్నికలలో జగన్ తో కలిసి తెలుగుదేశం ఓటమికి కారణమయ్యిందన్న భావనకు తోడు ఇప్పుడు చంద్రబాబు అరెస్టుపై కేటీఆర్ వ్యాఖ్యలు కలిసి ఆంధ్రా సెటిలర్లలో బీఆర్ఎస్ పై నమ్మకం కోల్పోయేలా చేశాయి.
కానీ కేటీఆర్ ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు. తెలుగుదేశం పార్టీపైనా, చంద్రబాబుపైనా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోయినా.. ఆ మధ్య చంద్రబాబు ఆరోగ్యంపై లోకేష్ ట్వీట్ కు బదిలిస్తూ సానుభూతి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు ఆరోగ్యంపై నారా లోకేష్ ట్వీట్ నాకు చాలా బాధ కలిగించింది. ఓ కుమారుడిగా తండ్రి ఆరోగ్యంపై నారా లోకేష్ ఆందోళన ఎలా ఉంటుందో నాకు తెలుసు అంటూ తాను అన్న మాటలను కవర్ చేసుకొనే ప్రయత్నం చేశారు. అయితే, తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ టీడీపీ నేతలు కౌంటర్లు ఇచ్చారు. అప్పుడు ట్విట్టర్ లో స్పందించిన కేటీఆర్ ఇప్పుడు మరోసారి ప్రత్యక్షంగానే స్పందించారు. చంద్రబాబు అరెస్టు మానవీయ కోణంలో సరికాదంటూ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగా చూసినా 73 ఏళ్ల వయసున్న చంద్రబాబును అరెస్టు చేయడం సరికాదని, ఈ విషయం తెలిసిన ఎవరైనా అయ్యో పాపం అని అంటారని కేటీఆర్ చెప్పారు. ఇక, చంద్రబాబు భద్రతపై లోకేష్ ఆందోళన వ్యక్తం చేయడం సబబేనని కేటీఆర్ అన్నారు.
అంతటితో ఆగని కేటీఆర్ గతంలో తాము టీడీపీని విమర్శించడం వాస్తవమేనని, 2018లో కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకుందని, ఆ కోణంలోనే తాము అప్పుడు విమర్శలు చేశామని.. కానీ, ఇప్పుడు పరిస్థితులు వేరు.. టీడీపీ ఈసారి ఇక్కడ పోటీ చేయడం లేదు కాబట్టి ఆ పార్టీపై విమర్శలకు తావేలేదని చెప్పారు. ఒకవైపు చంద్రబాబు అరెస్టు, ఆరోగ్యంపై సానుభూతి వ్యక్తం చేస్తూనే టీడీపీ తమకు ప్రత్యర్థి కాదని కేటీఆర్ చెప్పే ప్రయత్నం చేశారు. టీడీపీ వైఖరిపై ఒక్కో మెట్టుగా ఇప్పటికి కేటీఆర్ స్వరం పూర్తిగా మారింది. అయితే జరగాల్సిన నష్టం జరిగిపోయిందన్నది పరిశీలకుల అభిప్రాయం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సెటిలర్లపై దృష్టిపెట్టి వాళ్ళను దగ్గర చేసుకొనే ప్రయత్నం చేసింది. సెటిలర్లు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో వాళ్ళు కోరిన వారికే టికెట్లను కేటాయిస్తుండడమే కాకుండా నియోజకవర్గాల వారీగా వాళ్ళ కోసం ప్రత్యేకంగా సమ్మేళనాలను ఏర్పాటు చేసి అక్కున చేర్చుకుంది. ఇక ఇప్పుడు కేటీఆర్ వ్యాఖ్యలు ఎంతవరకు వాళ్ళను ప్రభావితం చేస్తాయన్నది చూడాలి.