పార్టీ, పాలనా బాధ్యతలు కేటీఆర్ కు.. కేసీఆర్ కార్యక్షేత్రం ఇక ఢిల్లీయే!?
posted on Nov 14, 2022 8:40AM
మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తరువాత తెలంగాణలో రాజకీయ కాక పెరిగింది. ఉప ఎన్నికలో విజయంతో తెరాసలో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. అదే సమయంలో గట్టి పోటీ ఇచ్చిన ఆనందం బీజేపీలో కనిపిస్తోంది. అయితే సిట్టింగ్ సీటు కోల్పోయిన కాంగ్రెస్ లో మాత్రం నిస్తేజం తాండ విస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు మరింత ఎక్కువయ్యాయి. ఇక మోడీ పర్యటనతో బీజేపీలో దూకుడు పెరిగింది.
అవన్నీ పక్కన పెడితే.. తెరాస మాత్రం భవిష్యత్ కార్యాచరణతో ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. బీఆర్ఎస్ ను జాతీయ స్థాయలో బలేపేతం చేసేందుకు ఇక నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తినను కార్యక్షేత్రంగా మార్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఢిల్లీలో భారీ బహిరంగ సభతో బీఆర్ఎస్ ఆగమనాన్ని ఘనంగా చాటాలనే ఉద్దేశంతో ఉన్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు, కార్యాచరణ ఇప్పటికే మొదలెట్టేశారంటున్నారు. ఆ సభ వేదికగానే బీఆర్ఎస్ జెండా, అజెండా ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ మంగళవారం (నవంబర్ 15)న పార్టీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ కార్యవర్గ సమావేశంతో భవిష్యత్ కార్యాచరణపై కేసీఆర్ పార్టీకి దిశా నిర్దేశం చేయనున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలంటే.. ముందుగా రాష్ట్రంలో పార్టీ ప్రభుత్వ బాధ్యతలను కేటీఆర్ కు పూర్తి స్థాయిలో అప్పగించాల్సి ఉంది. అందుకే నవంబర్ 15న జరగనున్న కార్యవర్గ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే ఏడాదిలో జరగాల్సిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై కూడా కేసీఆర్ పార్టీ నాయకులు, కేడర్ కు దిశా నిర్దేశం చేసే అవకాశం ఉంది. అలాగే ముందస్తు ఎన్నికల ప్రతిపాదన కూడా సీఎం చేసే అవకాశం ఉందని తెరాస వర్గాలు చెబుతున్నాయి. అన్నిటి కంటే ముఖ్యంగా సీఎం బాధ్యతలు కేటీఆర్‌కు అప్పగించే విషయమై ఈ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ ప్రకటేన చేసే అవకాశం ఉందన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఇప్పటికే టీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు కూడా కేసీఆర్ అనంతరం కేటీఆర్ ముఖ్యమంత్రి అని బహిరంగంగానే చెబుతున్నారు.
దానిపై ఈ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర పోషించేందుకు నిర్ణయించుకున్న కేసీఆర్ ఇక రాష్ట్ర పాలనా వ్యవహారాలపై దృష్టి కేంద్రీకరించడానికి అవకాశాలు తక్కువేననీ, అందుకే మొత్తం బాధ్యతలను కేటీఆర్ కు అప్పగించి తన కార్యక్షేత్రాన్ని డిల్లీకి మార్చే నిర్ణయానికి వచ్చేసిన కేసీఆర్ కార్యవర్గ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు.
వచ్చే నెలలో గుజరాత్ మొత్తంగా కేసీఆర్ వచ్చే ఆరు నెలలు తెలంగాణలోనే తీరిక లేని రాజకీయ కార్యక్రమాలు చేపట్టనున్నట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత జాతీయ రాజకీయాలపై దృష్టి పెడతారని అంటున్నారు. ఇప్పటికైతే ముందస్తు ఎన్నికల ఆలోచన లేదని.. బీజేపీ కూడా ముందుకు రాకపోవచ్చని అంటున్నారు. మంగళవారం కేసీఆర్ నిర్వహించనున్న విస్తృత కార్యవర్గ సమావేశంలో టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అందులోనే… ముందస్తుకు వెళ్తారా లేదా కేటీఆర్‌ను సీఎంను చేస్తారా అన్న విషయాలపై చూచాయగా అయినా కేసీఆర్ క్లారిటీ ఇచ్చే చాన్స్ ఉందని టీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. అన్నిటికీ మించి వచ్చే నెలలో గుజరాత్ కు అసెంబ్లీ కి రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలలో బీఆర్ఎస్ పోటీ చేస్తుందన్న సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే గుజరాత్ లో బీఆర్ఎస్ పోటీపై ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చేసిన కేసీఆర్... ఆ రాష్ట్రంలో కనీసం ఆరేడు స్థానాలలోనైనా విజయం సాధించి మోడీకి సవాల్ విసరాలన్న అభిప్రాయంతో ఉన్నారు.
ఇప్పటికే బీఆర్ఎస్ గుజరాత్ ఇన్ చార్జిగా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శంకర్ శింగ్ వఘేలాను నియమించాలని ఆయన నిర్ణయించారనీ, శంకర్ సింగ్ వఘేలా కూడా ఒకటి రెండు రోజుల్లో తాను కేసీఆర్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ అంటున్నారు. అలాగే తెలుగు వారి సంఖ్య అధికంగా ఉండే సూరప్ ప్రాంతంలో మొదటిగా బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలన్న ఉద్దేశంతో కేసీఆర్ ఉన్నారు. అలాగే శంకర్ సింగ్ వఘేలా తోడ్పాటుతో గుజరాత్ లో మరి కొన్ని స్థానాలలో కూడా బీఆర్ఎస్ పాగా వేయగలదని ఆశిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే మంగళవారం (నవంబర్ 15)న జరగనున్న టీఆర్ఎస్ కార్యవర్గ సమాశం ఎనలేని రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.