భీమవరం నుండి పోటీ చేస్తా..కేటీఆర్
posted on Jan 8, 2016 @ 12:12PM
టీఆర్ఎస్ తరుపున గ్రేటర్ ఎన్నికల బాధ్యతను మొత్తం తెలంగాణ మంత్రి కేటీఆర్ తన భుజాల మీద వేసుకున్న సంగతి తెలసిందే. అయితే ఈ గ్రేటర్లో సెటిలర్లు ఎక్కువగా ఉన్న కారణంగా వారిని ఆకర్షించేందుకు కేటీఆర్ తన వాక్చాతుర్యాన్ని బాగానే వాడుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఇక్కడ మా ప్రభుత్వానికి అవకాశం ఇవ్వండి.. ఏపీలో అయితే టీడీపీకి మద్దతివ్వండి అంటూ సీమాంధ్రులను ఆకర్షించే విధంగా మాట్లాడారు. ఈ మాటలకే ఏపీ నేతలు షాకవుతుంటే మళ్లీ ఇప్పుడు ఓ సంచలన వ్యాఖ్య చేశారు మంత్రి కేటీఆర్. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని త్వరలో తెలుగు రాష్ట్రాల సమితి పార్టీగా మార్చేస్తామని.. తాను పోటీ చేస్తే భీమవరం నుంచి పోటీ చేస్తానని అన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ రాజధాని శంకుస్థాపనకు వచ్చిన కేసీఆర్.. అక్కడ మాట్లాడినప్పుడు ఏపీ ముఖ్యమంత్రి కంటే ఎక్కువ స్పందన వచ్చిందని.. మా సీఎంకు ఏపీలో వచ్చిన ఆదరణ చూశాక అక్కడా పోటీ చేయాలనుకుంటున్నామని అన్నారంట. అంతేకాదు తాను ఒకవేళ పోటీ చేయాల్సి వస్తే భీమవరం నుండి పోటీ చేస్తానని.. అక్కడైతేనే నేను ఈజీగా గెలుస్తానని చెప్పుకొచ్చారట.
అయితే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు గాను గెలుస్తానని అంత ధీమాగా ఎలా చెపుతున్నారని అడిగితే ఏముంది అక్కడ కోడిపందేలు లీగలైజ్ చేస్తానని చెప్పారంట. దీంతో కేటీఆర్ మాటలకు అక్కడ ఉన్న వారందరూ నవ్వులు కురిపించారు. అయితే దీనికి రాజకీయ విశ్లేషకులు మాత్రం వేరే విధంగా చెబుతున్నారు. కేటీఆర్ చెప్పె మాటలు అంతా ఊరికే అని.. గ్రేటర్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో సీమాంధ్ర నేతలను ఆకట్టుకోవడానికే ఇలా మాట్లాడుతున్నారని.. అంతకు మించి ఏం లేదని అంటున్నారు.