నేడు రెబల్ స్టార్ కృష్ణం రాజు అంత్యక్రియలు..ఎక్కడంటే?
posted on Sep 12, 2022 7:06AM
నటుడు, రెబల్ స్టార్, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆదివారం(సెప్టెంబర్11) ఉదయం మరణించిన సంగతి విదితమే. ఆయన మరణం టాలీవుడ్ లో తీవ్ర విషాదం మిగిల్చింది. సినీ, రాజకీయ ప్రముఖులంతా తరలివచ్చి కృష్ణంరాజుకి నివాళులు అర్పించారు. అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం కృష్ణంరాజు పార్థివదేహం జూబ్లీహిల్స్,రోడ్ నెంబర్ 28లోని ఆయన నివాసం వద్దే సోమవారం(సెప్టెంబర్12) మధ్యాహ్నం వరకు ఉంచుతారు. ఆ తరువాత హీరో కృష్ణంరాజు అంత్యక్రియలు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామంలోని అయన ఫామ్ హౌస్ లో అధికార లాంఛనాలతో జరుగుతాయి. మధ్యాహ్నం 12 గంటలకు కృష్ణం రాజు ఇంటి వద్ద నుంచి ఆయన పార్థివదేహాన్ని అంతిమయాత్రగా మొయినాబాద్ కి తరలిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు కనకమామిడిలోని ఆయన ఫామ్ హౌస్ లో కృష్ణంరాజు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరగనున్నాయి.
మధుమేహం, పోస్ట్ కొవిడ్ సమస్యలతో బాధపడుతూ తీవ్రమైన కార్డియాక్ అరెస్ట్‌తో ఆయన ఏజీఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున ఆయన కన్నుమూసిన సంగతి తెలిసిందే. గుండె కొట్టుకునే వేగం విషయంలో చాలా కాలంగా ఆయన సమస్య ఎదుర్కొంటున్నారు. రక్తప్రసరణ సరిగా లేకపోవడంతో గతేడాది ఆయన కాలికి శస్త్రచికిత్స కూడా జరిగింది. అలాగే, దీర్ఘ కాలంగా మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారు. గత నెల 5న పోస్టు కొవిడ్ సమస్యలతో కృష్ణంరాజు ఆసుపత్రిలో చేరారు. కిడ్నీలు పూర్తిగా పాడైపోవడంతో ఆసుపత్రిలో చేరినప్పటి నుంచే వెంటిలేటర్‌పై ఉంచినట్టు చెప్పారు. ఆదివారం తెల్లవారు జామున తీవ్రమైన గుండెపోట రావడంతో ఆయన కన్నుమూశారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. 1940, జనవరి 20న ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో ఉన్నత కుటుంబంలో కృష్ణంరాజు జన్మించారు. ఆయన పూర్తిపేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. చదువు పూర్తికాగానే కొన్నాళ్లు జర్నలిస్టుగా పనిచేశారు.1966లో ‘చిలకా గోరింకా’ సినిమాతో సినీరంగ ప్రవేశంచేశారు. హీరోగా సినిమాల్లోకి అడుగుపెట్టిన ప్పటికీ ప్రతినాయకుడిగా కూడా అలరించారు. ఆయన సినీ రంగంలో హీరోగా నటజీవితం ఆరంభించినా, తర్వాత విలన్‌గానూ ప్రేక్షకులను మెప్పించిన గొప్ప నటుడు. అవేకళ్లు చిత్రంలో విలన్‌గా తనలో ప్రత్యేకతను చాటారు. చిలాకా గోరింక హీరోయేనా ఇంత అద్భు తంగా విలనీ పండించింది అనుకున్నారు ఆ రోజుల్లో. తన విలక్షణమైన నటనతో కొంతకాలంపాటు టాలీవుడ్‌ను ఏలిన రెబల్ స్టార్ 183కుపైగా చిత్రాల్లో నటించారు. భక్త కన్నప్ప, బొబ్బిలి బ్రహ్మన్న, అమరదీపం, మనవూరి పాండవులు చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. నిర్మాతగా గోపీకృష్ణ బ్యానర్‌లో పలు చిత్రాలు రూపొందించారు. ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధేశ్యామ్’ సినిమాలో వెండితెరపై కృష్ణంరాజు చివరిసారిగా కనిపించారు.
సినిమాల్లో నటిస్తూనే ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1991లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే ఏడాదిలో నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూపతిరాజు విజయకుమార్ రాజు చేతిలో ఓడిపోయాడు. 1998 ఎన్నికల ముందు బీజేపీలో చేరి కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి విజయం సాధించి లోక్‌సభలో అడుగుపెట్టారు. 1999లో మధ్యంతర ఎన్నికలలో ఆయన నర్సాపురం నుంచి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపిరాజుపై గెలుపొందారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2004లో జరిగిన ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు.
ప్రముఖ సీనియర్ నటులు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు మృతికి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం తెలి పారు. తన విలక్షణమైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణం ఎంతో బాధ కలిగించిందని చంద్రబాబు అన్నారు. కేవలం నటునిగానే కాకుండా కేంద్రం మంత్రిగా కృష్ణంరాజు చేసిన సేవలను చంద్రబాబు గుర్తు చేసుకు న్నారు. 'రెబల్ స్టార్' గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం..తెలుగు వెండితెరకి తీరని లోటని అన్నారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.