కేసీఆర్ ను కేటీఆర్ ఏదైనా చేసి ఉండొచ్చు.. మళ్లీ నోరు జారిన కొండా సురేఖ
posted on Oct 4, 2024 @ 10:02AM
కొండా సురేఖ సంయమనం కోల్పోయారా? సోషల్ మీడియాలో తనపై ట్రోలింగ్ వెనుక కేటీఆర్ ఉన్నారన్న అనుమానంతో ఆమె విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు కొండా సురేఖ వ్యాఖ్యల రచ్చ హోరెత్తి పోతోంది. అసలే హైడ్రా కూల్చివేతలతో ఇంటా బయటా వెల్లువెత్తుతున్న వ్యతిరేకతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న రేవంత్ సర్కార్ కు ఇప్పుడు కొండా సురేఖ వ్యాఖ్యలు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టాయి. ఆమె వ్యాఖ్యలతో కాంగ్రెస్ సర్కార్, పార్టీ ప్రతిష్ఠ మంటగలిసే ప్రమాదం ఉందని అంటున్నారు పరిశీలకులు. దీంతో ఆమెపై చర్యలు తీసుకోక తప్పని అనివార్య పరిస్థితి రేవంత్ కు ఏర్పడిందని విశ్లేషిస్తున్నారు. నష్ట నవారణకు చేసిన ప్రయత్నాలు ఫలించే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. తాజాగా కేసీఆర్ ను కేటీఆరే ఎదో చేసి ఉంటారంటూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పరిస్థితిని మరింత దిగజార్చాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పై విమర్శల పేరుతో ఆమె సినీ హీరోయిన్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మరీ ముఖ్యంగా సమంత, నాగచైతన్య విడాకులు, రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి విషయంలో ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అయ్యింది. పలు చోట్ల కొండా సురేఖ దిష్టిబొమ్మలు సైతం దగ్ధం చేశారు. మొత్తం తెలుగు సినీ పరిశ్రమ కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుపట్టింది. సోషల్ మీడియాలో సురేఖ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగింది. ఆమె తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలంటూ నెటిజన్లు ఫైర్ అయ్యారు.
ఈ నేపథ్యంలోనే కొండా సురేష్ సమంతకు, నాగార్జున కుటుంబానికి క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ కూడా నష్ట నవారణ చర్యలకు ఉపక్రమించింది. కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని, క్షమాఫణ చెప్పినందున ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కోరారు. అయితే సమంత, నాగచైతన్య విడాకుల విషయంలో తాను మాట్లాడిన మాటలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పిన కొండా సురేఖ, కేటీఆర్ విషయంలో మాత్రం వెనక్కు తగ్గేదేలే అంటున్నారు.
గత కొన్ని రోజులుగా కొండా సురేఖ కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తనపై సామాజిక మాధ్యమంలో ట్రోలింగ్ కు సమర్ధిస్తున్నారంటూ సురేఖ కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె సమంత, నాగ చైతన్య విడాకులకు కారణం కేటీఆర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేసి వారిని వేధించారనీ కూడా విమర్శలు చేశారు. ఓ వైపు ఆ రచ్చ అలా కొనసాగుతుండగానే.. కొండా సురేఖ మరో సారి నోరు జారారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా జీవితం నుంచి దూరంగా ఉండడానికి కూడా కేటీఆరే కారణమని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. కేటీఆర్ ఆయనను ఏదో చేసి ఉంటారని వ్యాఖ్యానించారు.
కేటీఆర్ అధికార కాంక్షతో కేసీఆర్ ను ప్రజాజీవితంలోకి రాకుండా అండర్ గ్రౌండ్ లో బంధించి ఉంటారని కొండా సురేఖ అన్నారు. ఇటీవలి కాలంలో కేసీఆర్ ఎక్కడా కనిపించడం లేదన్న ఆమె ఆయన కనిపించకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. కేసీఆర్ క్షేమంపై ఆందోళన వ్యక్తం చేశారు. కేటీఆర్ కేసీఆర్ గొంతు నొక్కేస్తున్నారని ఆరోపించారు. మొత్తం మీద కొండా సురేఖ తీరు కాంగ్రెస్ సర్కార్ కు రోజుకో తలనొప్పి తీసుకువస్తున్నది. కాంగ్రెస్ లోనే ఆమె తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. దీంతో ఆమె మంత్రి పదవికి ఎసరు వచ్చే ప్రమాదం ఉందని పార్టీ వర్గాలలోనే ఓ చర్చ జోరుగా సాగుతోంది.