శ్రీనువైట్ల కి షాకిచ్చిన కోన వెంకట్
posted on Apr 10, 2013 @ 9:02PM
బాద్ షా సినిమా తరువాత దర్శకుడు శ్రీను వైట్ల, రచయిత కోన వెంకట్ల మద్య బేధాభిప్రాయాలు తలెత్తాయి. బాద్ షా సినిమాకు తను, గోపీ మోహన్ కలిసి కధ అందించినప్పటికీ, సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ లో కనీసం తన పేరు కూడా వేయలేదని కోన వెంకట్ ఆగ్రహం చెందడంతో వారి మద్య బేధాభిప్రాయాలు మొదలయ్యాయి. అయితే, ప్రింటింగ్ విభాగంలో జరిగిన చిన్నపొరపాటు వలననే పేరు అచ్చవలేదని, తరువాత వచ్చే అన్ని పోస్టర్స్ మరియు ట్రయలర్స్ లో కోన వెంకట్ పేరు తప్పకఉంటుందని నిర్మాత బండ్ల గణేష్ హామీ ఈయడంతో గొడవ సద్దుమనిగింది.
కానీ, సినిమా విడుదల అయిన తరువాత సినిమా అంత గొప్పగా హిట్టవడానికి కారణం శ్రీను వైట్ల దర్శకత్వ ప్రతిభ, అయన స్వయంగా వ్రాసుకొన్న సింగల్ లయిన్ డైలాగులే కారణమని మీడియాలో బాగా ప్రచారం జరగడంతో, కధ మళ్ళీ మొదటికి వచ్చింది. సినిమా విజయంలో తన పాత్ర ఏమి లేదా? అని కోన వెంకట్లో ఆవేశం కలగడం ఆ ఊపులో ట్వీటర్లో కొన్ని పంచు డైలాగులు పేల్చడం జరిగింది.
“కనీసం స్క్రీన్ ప్లే అనే పదానికి స్పెల్లింగు కూడా వ్రాయడం చేత కాని దర్శకులు చాల మందే ఉన్నారని” ఆయన చురకలు వేసారు. అవి ఎవరిని ఉద్దేశించి వేసినవో అందరికీ తెలుసు. ఆ తరువాత బాద్ షా హెక్సా ప్లాటినం డిస్క్ ఫంక్షన్ కి ఆహ్వానం వచ్చినా కోన వెంకట్ వెళ్ళలేదు కానీ, ట్వీటర్ లో మరి కొన్నిడైలాగులు వేసారు. “మమ్మల్ని కూడా సినిమా యూనిట్ లో సభ్యులుగా ఇంకా గుర్తుంచు కొన్నందుకు చాల థాంక్స్,” అని ఆ తరువాత “మమ్మల్ని వాడుకోండి, ఉపయోగించుకోండి, కానీ అవసరం తీరిన తరువాత విసిరి పారేయకండి” అనే డైలాగుతో, దాదాపు 10సం.లు కలిసి పనిచేసి, 8 విజయవంతమయిన సినిమాలకు కధలందించిన వారి స్నేహసంబంధాలు పుట్టుకున తెగిపోయాయి.
అందుకు శ్రీను వైట్ల కూడా స్పందించక పోవడం విశేషం. కానీ ఆయనకు బదులు వారిరువురితో కలిసి పనిచేసిన మరో రచయిత గోపీ మోహన్ “నేను గత 10 ఏళ్లుగా శ్రీను వైట్లతో కలిసి పనిచేస్తున్నాను. ఆయన రచయితలకు పూర్తి స్వేచ్చానిస్తారు. మా ఇరువురి మద్య చక్కటి అవగాహన, అనుబంధం ఉంది” అని ట్వీట్ చేయడంతో వారి ముగ్గురు కధ మంచి క్లయిమాక్స్ తో ముగిసింది.
అప్పుడే, కోన వెంకట్ తానేమిటో త్వరలో నిరూపించుకోనున్నాని, పెన్ను పట్టినవాడు మెగా ఫోన్ పట్టలేదని భావించవద్దంటూ అనడమే కాకుండా, త్వరలో తన మాటలు నిజం చేసిచూపేందుకు సిద్ధం అయ్యాడు. పవన్ కళ్యాణ్ నటించనున్న గబ్బర్ సింగ్-2 సినిమాకి ఆయన కధ మరియు దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నట్లు తాజా సమాచారం. ఈ సినిమాను పవన్ కళ్యాణ్ స్వయంగా తన స్వంత బ్యానర్లో నిర్మిస్తారని మరో సమాచారం.
ఒక కధా రచయిత మెగాఫోను చేపడితే అది ఎంత ఘాటుగా ఉంటుందో ఇప్పటికే కొరటాల శివ తన మిర్చీ సినిమాతో నిరూపించాడు. మరి సుదీర్గ అనుభవం ఉన్న కోన వెంకట్ దర్శకత్వం వహిస్తే ఆ సినిమా ఎలా ఉంటుందో చూడాల్సిందే. పెన్ను, కాగితాలు వేసుకొని గదిలో ఓ మూల కూర్చొని కధలు వ్రాసుకొనే వాడిని రెచ్చ గోడితే మరో కొత్త దర్శకుడుపుడితే, అది పోటీ పెంచుతుందే తప్ప తగ్గించదు కదా! దాని వల్ల ఎవరికి నష్టం అని కోన వెంకట్ మరో చిన్న డైలాగు పేల్చినట్లు సమాచారం. ఆయన చెప్పింది నిజమే కదా!