అనవసరంగా విడ‌గొట్టారు! ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌యే బాగుండేది!

ఉమ్మడి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌యే బాగుంది! అనవసరంగా విడిపోయాం అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంటులో తెలంగాణ కోసం కొట్లాడినందుకు తాను ఇప్పుడు బాధపడుతున్నానని ఆయ‌న చెప్పారు. అసెంబ్లీ విరామంలో రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడారు. కాంగ్రెస్ వల్లనే తెలంగాణ వచ్చిందని చెప్పిన సీఎం కేసీఆర్‌. ఇప్పుడు అదే కాంగ్రెస్‌పార్టీని కరోనా వైరస్‌తో పోల్చడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

రేవంత్‌రెడ్డి అరెస్టు విషయంలో పార్టీకి నష్టం కలిగించేలా సీనియర్ నాయకులు మాట్లాడటం మంచి పద్ధతి కాదని, పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే జూనియర్లను ప్రోత్సహించాల్సింది పోయి.. విమర్శలు చేయడం తగదని అన్నారు. రేవంత్‌రెడ్డికి తాను ఎప్పుడూ వ్యతిరేకం కాదన్నారు. కానీ, ఎంపీగా ఉన్న ఓ వ్యక్తి డ్రోన్‌‌తో కేటీఆర్ ఫామ్‌హౌస్‌ ఫొటోలు తీయించడం సరికాదన్నారు. దీన్ని సాకుగా చేసి ప్రభుత్వం ఆయన్ను అరెస్టు చేయించడమూ దారుణమన్నారు.

బలమైన నాయకత్వ లక్షణాలు, సామాజిక వర్గం, కలుపుగోలు తనం ఉన్న వారినే పీసీసీ అధ్యక్షుడిగా నియమించాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు. అలాంటి లక్షణాలున్న నాయకుల్లో తానే మొదటివాడిని చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికలో ఆదిష్ఠానం నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని కోరారు. ఒకవేళ పార్టీ అదిష్ఠానం సరైన నిర్ణయం తీసుకోకపోతే తమదారి తాము చూసుకుంటామని తేల్చి చెప్పారు.

Teluguone gnews banner