ఏపీ ఎన్జీవోల సభకు కిషన్ రెడ్డి మద్దతు దేనికి సంకేతం?
posted on Sep 6, 2013 @ 7:32PM
వరంగల్ జిల్లా, హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్వర్యంలో చేప్పట్టిన తెలంగాణ సాధన దీక్ష ముగింపు సందర్భంగా మాట్లాడుతూ తమ పార్టీ రేపటి జేఏసీ బంద్ పిలుపుకు మద్దతునిచ్చే విషయంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. అదేవిధంగా హైదరాబాదులో రేపు ఏపీ ఎన్జీవోల సభ జరుపుకోవడాన్నిసమర్దించారు.
మోడీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా రాష్ట్ర విభజనకు అనుకూలంగా మాట్లాడటమే కాక జై తెలంగాణా, జై సమైక్యాంధ్ర అని సభకు వచ్చిన వారితో నినాదాలు కూడా చేయించి తమ పార్టీ స్పష్టమయిన వైఖరిని చాటారు. అయితే, ఆ తరువాత సీమంద్రాలో ఉదృతమవుతున్న సమైక్యాంధ్ర ఉద్యమాలను గమనించిన బీజేపీ క్రమంగా ప్రత్యేక తెలంగాణా నుండి 'సమన్యాయం' వైపు మరలిందని బీజేపీ నేత వెంకయ్య నాయుడు పార్లమెంటులో మాట్లాడిన మాటలను బట్టి అర్ధమవుతోంది.
అందుకు కారణం రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పార్టీకి సహకరించడం వలన కాంగ్రెస్ పార్టీయే లాభపడుతుంది తప్ప, బీజేపీకి ఒరిగేదేమీ లేదని తాజాగా జ్ఞానోదయం పొందడమే. అందువల్ల కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే తెలంగాణా బిల్లుకి ఏవో కుంటి సాకులు చెప్పి మద్దతు పలకకుండా తప్పుకొని, రానున్న ఎన్నికలలో తమకు అధికారం ఇస్తే వంద రోజుల్లో తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తామని చెప్పి ఎన్నికలలో గెలవాలని బీజేపీ తాజా వ్యూహం. బహుశః తదనుగుణంగానే నేడు కిషన్ రెడ్డి కూడా తన అభీష్టానికి వ్యతిరేఖంగా ఏపీ ఎన్జీవోల సభకు మద్దతు తెలిపారనుకోవచ్చును.
తెరాసలో జేరి ఉద్యమంలో చురుకుగా పాల్గొనాలనే ఆశతో తెదేపా నుండి బయటకి వచ్చి భంగపడిన నాగం జనార్ధన్ రెడ్డి, తెలంగాణా పట్ల స్పష్టమైన వైఖరి అవలంభిస్తున్నబీజేపీలో చేరారు. అయితే ఇప్పుడు ఆ పార్టీ కూడా ‘యూ టర్న్’ తీసుకోవడంతో కంగు తిన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఏపీ ఎన్జీవోల సభకు మద్దతుగా, రేపు సభను అడ్డుకొనేందుకు టీ-జేఏసీ తలపెట్టిన బంద్ కి వ్యతిరేఖంగామాట్లాడుతుంటే, నాగం జనార్ధన్ రెడ్డి మాత్రం ఆయనతో విభేదిస్తూ సభను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవలసిందే, బంద్ విజయవంతం చేయవలసిందేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేసారు.
ఆయనవంటి సీనియర్ రాజకీయ నేత పార్టీ ఆలోచనలను గ్రహించకపోవడం విచిత్రమే. కిషన్ రెడ్డి మాత్రం ఒకవైపు తెలంగాణా సాధన సభ వంటి కార్యక్రమాలు చేపడుతూనే, మరో వైపు మారిన పార్టీ వైఖరికి అనుగుణంగా మాట్లాడుతూ తెలివయిన రాజకీయ నాయకుడిగా నిరూపించుకొంటున్నారు.