కిరణ్ మార్పుపై చర్చించడం లేదు: వాయలార్ రవి

 

2014 వరకు సీఎం మార్పు ఉండదని, కిరణే సీఎం అని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల పరిశీలకుడు వాయలార్ రవి స్పష్టం చేశారు. సీఎం మార్పుపై అధిష్టానం ఎలాంటి చర్చలు జరపలేదని ఆయన తెలిపారు. తెలంగాణపై ఎవరి అభిప్రాయాలు వారు చెపుతున్నారని, అందరి అభిప్రాయాలను సోనియాకు చేరవేస్తున్నానని ఆయన అన్నారు. తుది నిర్ణయం సోనియానే తీసుకోవాలని వాయలార్‌రవి పేర్కొన్నారు.

 

ఇటీవల కిరణ్ కుమార్ రెడ్డిని మార్చి ఆయన స్థానంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలు.. మర్రి శశిధర్ రెడ్డి, కుందూరు జానా రెడ్డి లేదా డి.శ్రీనివాస్‌ను కూర్చుండబెడతారనే వార్తలు వచ్చాయి. నవంబర్ 9వ తేది లోగా కిరణ్ మార్పు ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వాయలార్ రవి మంగళవారం స్పందిస్తూ.. మార్పు కేవలం ఊహాగానాలే అని కొట్టి పారేశారు.



రెండు రోజుల క్రితం న్యూఢిల్లీలో జరిగిన కాంగ్రెసు ప్రజా సభకు వెళ్లిన రాష్ట్ర నేతలు పలువురు ఆ సభ ముగిసిన తర్వాత కూడా అక్కడే మకాం వేశారు. సోమవారం సోనియా గాంధీ సహా పలువురు పార్టీ పెద్దలను కలిసి తెలంగాణపై తేల్చాలని, ముఖ్యమంత్రి మార్పు అవసరం లేదని చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి.

Teluguone gnews banner