కిరణ్ కొత్త పార్టీకి హై కమండ్ గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందా?
posted on Mar 6, 2014 @ 12:56PM
గత ఆరేడు నెలలుగా కిరణ్ కుమార్ రెడ్డి కొత్తపార్టీ గురించి విస్తృతంగా ప్రచారం జరిగినప్పటికీ, ఆయన ఇంతకాలంగా మీన మేషాలు లెక్కిస్తూ కాలక్షేపం చేయడంతో, ఆయన పార్టీపై ప్రజలకే కాదు మీడియాకు కూడా నిరాసక్తత ఏర్పడింది. సీమాంధ్రలో విభజనను వ్యతిరేఖిస్తూ ఉవ్వెత్తున ఉద్యమాలు జరుగుతున్న తరుణంలో ఆయన పార్టీకి, పదవికి రాజీనామా చేసి, కొత్త పార్టీ పెట్టి ఉండి ఉంటే అప్పుడు వచ్చే ఆ ఆధారణే వేరు. కానీ, కాంగ్రెస్ హై కమండ్ నుండి అనుమతి లేనందునే తను పదవికి రాజీనామా చేయలేకపోయానని స్వయంగా చెప్పుకొని, రాష్ట్ర విభజన పూర్తిగా జరిగిపోయిన తరువాత మరి అనుమతి దొరికిందో ఏమో తాపీగా రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టేందుకు సిద్దపడ్డారు. కానీ, కనీసం ఆ విషయాన్ని కూడా ఆయన స్వయంగా, దైర్యంగా ప్రకటించకుండా శైలజానాథ్, సబ్బంహరి, రాయపాటి వంటి వారితో మీడియాకు న్యూస్ లీకులు ఇస్తూ పార్టీ పట్ల ప్రజలలో ఆసక్తి పెరిగేలా చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఆవిధంగా చేయడం వలన ప్రజలలో ఆయన పట్ల, ఆయన పెట్టబోయే పార్టీపట్ల మరింత వ్యతిరేఖ భావన, అనాసక్తి ఏర్పడింది.
దానికితోడు మొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా పార్టీ పెట్టబోతున్నట్లు ప్రచారం అవడంతో, కిరణ్ కుమార్ రెడ్డి ఇక కొత్త పార్టీ ఆలోచన విరమించుకోక తప్పనిసరి పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ, ఆయన అదృష్టమో లేక మెగాభిమానుల దురదృష్టమో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టె ఆలోచనను విరమించుకొంటున్నట్లు వార్తలు వెలువడ్డాయి. పవన్ కళ్యాణ్ వంటి నిజాయితీ పరుడు, మానవతావాది రాజకీయాలలోకి ప్రవేశించాలని ఆశించిన వారందరూ ఆయన తాజా నిర్ణయంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే, కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం తప్పకుండా చాలా సంతోషించి ఉండాలి.
ఒకవేళ పవన్ కళ్యాణ్ రంగ ప్రవేశం చేసినట్లయితే, సీమాంధ్రలో ఇప్పటికే దాదాపు ఖాళీ అయిపోతున్న కాంగ్రెస్ పార్టీ, ఇక ఎన్నికలలో పోటీ చేయవలసిన అవసరం, శ్రమ కూడా ఉండదు. గనుక, కాంగ్రెస్ అధిష్టానం చిరంజీవి ద్వారా కుటుంబ సభ్యులపైన, వారిద్వారా పవన్ కళ్యాణ్ పైన పరోక్షంగా ఒత్తిడి చేసి ఆయనను విరమింపజేసిన తరువాత కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందో లేక ఇంకా మీన మేషాలు లెక్కిస్తూ కూర్చొంటే ఉన్నపరువు కూడా పోతుందని మరి భయపడ్డారో లేక ఎన్నికల భేరీ మ్రోగిందని తొందరపడుతున్నారో తెలియదు కానీ ఆయన ఈరోజే తన కొత్త పార్టీని ప్రకటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇక రాష్ట్రం రెండుగా విడిపోతున్న ఈ సమయంలో కూడా ఆయన ‘జై సమైక్యాంధ్ర పార్టీ’ అనే పేరుతో రిజిస్టర్ చేయించిన పేరును తన పార్టీకి వాడుకోబోతున్నట్లు వస్తున్న వార్తలు నిజమయితే, కేసీఆర్ తెలంగాణాపేరు చెప్పుకొని బలపడినట్లుగా, సమైక్యాంధ్ర పేరు చెప్పుకొని కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికలలో ఓట్లు దండుకోవాలని ఆలోచిస్తున్నట్లు అర్ధమవుతుంది. ఏమయినప్పటికీ, ఆయన కొత్త పార్టీ పెట్టినట్లయితే, అది కాంగ్రెస్ మహావృక్షానికి మొలిచిన మరో కొమ్మే అవుతుంది తప్ప వేరే కాదని ఖచ్చితంగా చెప్పవచ్చును.