కిరణ్ మార్పు ఊహాగానాలే : ఆజాద్
posted on Nov 16, 2012 @ 9:46AM
గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు పై వస్తున్న వుహగానాలకు కాంగ్రెస్ అధిష్టానం తెరదించింది. రాష్ట్రంలో జరిగిన రాజీకీయ పరిణామాలపై సుదీర్ఘ అంతర్మధనం జరిపిన ఆజాద్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల కిరణ్ కుమార్ రెడ్డిని మార్చి ఆయన స్థానంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలు.. మర్రి శశిధర్ రెడ్డిని కూర్చుండబెడతారనే వార్తలు వచ్చాయి. కిరణ్ మార్పు ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆజాద్ స్పందిస్తూ.. మార్పు కేవలం ఊహాగానాలే అని కొట్టి పారేశారు.
రాష్ట్రంలో సీఎం, పిసీసీ మార్పు లేదని అన్నారు. ఎంఐఎం మద్దతు ఉపసంహరణకు దారితీసిన పరిణామాలపై అసదుద్దీన్ తో ఫోనులో మాట్లాడినట్లు చెప్పారు. తదుపరి చర్చలు పార్లమెంట్ సమావేశాల టైం లో ఉంటాయని వెల్లడించారు. కిరణ్ పై ఒవైసీ చేసిన విమర్శలను ఆజాద్ కొట్టిపారేశారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులెవ్వరూ ఒక మతానికి కొమ్ముకాయరాని, తమది లౌకిక పార్టీ అని అన్నారు. ముఖ్యమంత్రిపై మతతత్వవాది ముద్రవేయడటం వుహతీతమని పేర్కొన్నారు.
మరోవైపు ఎంఐఎం ఆరోపణల నేపధ్యంలో కిరణ్కుమార్ రెడ్డిని మార్చితే ఆ ఆరోపణలకు బలం చేకూరుతుందన్న ఉద్దేశంతోనే ఆజాద్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చన్న వాదన వినిపిస్తోంది. సీఎం మార్పు ప్రచారాన్ని కొట్టివేయకపోతే అసదుద్దీన్ ఒత్తిడికి కాంగ్రెస్ లొగిందన్న అపవాదు వస్తుందని ఆజాద్ వ్యూహాత్మకంగా మాట్లాడి ఉండొచ్చని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు విశ్లేషిస్తున్నారు.