గోటితో పోయేదానిని గొడ్డలి వరకు తెచ్చుకొన్న కిరణ్

 

 

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఏవయినా ముఖ్య నిర్ణయాలు తీసుకొనేటప్పుడు అటు పార్టీలో కానీ, ఇటు కేబినేట్ సహచరులతో గానీ సంప్రదించే అలవాటు లేదని విద్యుత్ చార్జీల పెంపు విషయంలో మరో మారు రుజువు చేసుకొన్నారు. కరెంటు చార్జీలపై ప్రతిపక్షాల ఆందోళనలకి ఎంత మాత్రం భయపడని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్వపక్షంలోనే తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాక వెనక్కి తగ్గక తప్పలేదు.

 

అయినప్పటికీ, 200 యూనిట్లు లోపుగా వాడుకోనేవారికే తప్ప మిగిలిన వారికి మాత్రం పెంచిన చార్జీలు యధాతధంగా వర్తింపజేశారు. 200 యూనిట్లు దాటి ఒక్క యూనిట్ అధికంగా వాడినా మొత్తం బిల్లు కొత్త చార్జీల ప్రకారమే చెల్లించవలసి ఉంటుంది. ఆయన తీసుకొన్న నిర్ణయం ప్రజలను అవహేళన చేయడమే తప్ప మరొకటి కాదు. ముఖ్యమంత్రి నిర్ణయంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రతిపక్షాలు తమ అందోళనలను మరింత ఉదృతం చేయనున్నట్లు ప్రకటించాయి.

 

ముఖ్యమంత్రి మొండిగా ఎవరినీ ఖాతరు చేయకుండా నిర్ణయాలు తీసుకోవడం, ఆ తరువాత స్వపక్ష విపక్షాల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న తరువాత వెనక్కి తగ్గటం ఒక అలవాటుగా మారిపోయింది. ఈ అలవాటు వలన ఆయన తన పేరు తానే పాడు చేసుకోవడమే కాకుండా, పార్టీకి కూడా ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తున్నారు. తద్వారా ప్రజలలో ఇప్పటికే ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేఖతని మరింత పెంచి పోషిస్తూ పార్టీకి మరింత నష్టం కలిగిస్తున్నారని వీ. హనుమంత రావు వంటి సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

 

కానీ, అధిష్టానం అండదండలు ఉండటంతో కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం తన బాటలో తానూ ముందుకు సాగిపోతున్నారు. ఎన్నికలకి ఇంకా చాల సమయం ఉంది గనుక ప్రస్తుతం ఆయనకి ఎవరినీ ఖాతరు చేయవలసిన అవసరం ఉండకపోవచ్చును. కానీ రేపు ఎన్నికలు దగ్గిర పడిన తరువాత పార్టీలో కార్యకర్త మొదలు సీనియర్ల వరకు అందరి సహకారం అవసరం ఉంటుంది. ఒంటి చేత్తో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఆయనేమి వైయస్సార్ కాదని తెలుసుకొంటే, పార్టీలో అందరి సహకారం ఎంత అవసరమో ఆయనకి అర్ధం అవుతుంది.

 

కరెంటు చార్జీలు పెంచడం అనివార్యం అయినప్పుడు ఆ సంగతిని పార్టీలో, ప్రభుత్వంలో చర్చించిన తరువాత వారి అభిప్రాయం తీసుకొని, ఒకసారి ప్రతిపక్షాలను కూడా కూర్చోబెట్టి వారితో మాట్లాడి ఉంటే ఈరోజు ఇన్ని ఆందోళనలు ఉండేవి కావు. కానీ, అహం అడ్డు రావడం వలనో లేక ఎవరినీ సంప్రదించవలసిన అవసరం తనకు లేదనే అహంభావం వలనో ముఖ్యమంత్రి ఓ నిర్ణయం తీసేసుకొని గోటితో పోయే దానిని గొడ్డలి వరకు తీసుకువచ్చి చేతులు కాలేక ఆకులు పట్టుకొన్నట్లు వెనక్కి తగ్గక తప్పలేదు. దీని వల్ల ప్రజలలో నవ్వులపాలవడమే కాకుండా, రేపు డిల్లీ వెళ్ళినప్పుడు అధిష్టానం చేత కూడా అక్షింతలు వేయించుకోక తప్పదు. అందువల్ల కనీసం ఇప్పటినుంచయినా తన వ్యవహార శైలి మార్చుకొనకపోతే అది ఆయనకీ, కాంగ్రెస్ పార్టీకీ నష్టం కలిగిస్తుంది చెప్పకతప్పదు.

Teluguone gnews banner