టీడీపీ వర్గపోరుపై నాని కామెంట్స్
posted on Feb 19, 2021 @ 4:24PM
విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల సందర్భంగా నగర టీడీపీలో వర్గ విభేదాలు బయటుపడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. "ఎవరైనా తన వెనుక రావాల్సిందేనని.. తాను ఒకరి వెనుక వెళ్లాల్సిన అవసరం లేదని" కేశినేని నాని తేల్చి చెప్పారు. తనకున్న ప్రజాబలంతో విజయవాడలో టీడీపీని గెలిపిస్తానని అయన స్పష్టం చేశారు. ఓడిపోయిన సామంతులే ఇప్పుడు పార్టీకి నష్టం చేస్తున్నారని అయన ఆరోపించారు.
అంతేకాకుండా "ఓటమి చెందే అభ్యర్థులను మార్చితే తప్పేంటి? ప్రజలకు క్యారెక్టర్, క్యాలిబర్ ఉన్నోడంటే నమ్మకం. అవినీతిపరులు, లాలూచీపరులను ప్రజలు నమ్మరు. ముస్లిం కోసం చంద్రబాబును కూడా కాదని నిలబడ్డా. అందరూ కలిసి వెళ్లాల్సిన సమయంలో పార్టీకి నష్టం చేస్తున్నారు. నేను, నా కూతురు మేయర్ పదవి కోసం కష్టపడటం లేదు. పదవులు అక్కర్లేదు... పార్టీ కోసమే పని చేస్తున్నా. ఇంత జరుగుతున్నా చంద్రబాబుకు తెలియకుండా ఉంటుందా? వారిని చంద్రబాబు గాడిలో పెడితే పార్టీకే మంచిది" అని కేశినేని నాని హితవు పలికారు.