పవన్ ను కాదని నానికే బాబు సీటు
posted on Apr 15, 2014 @ 11:21AM
తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ సీటు ఎవరికి దక్కుతుంది అనే దానిపై గత రెండు రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఆఖరికి కేశినేని నానికే విజయవాడ ఎంపీ సీటును టిడిపి అధినేత బాబు ఖరారు చేశారు. దీంతో కేశినేని భవన్ వద్ద టిడిపి కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కేశినేనికే ఎంపీ సీటు దక్కుతుందని భావిస్తున్న తరుణంలో సడన్ గా పవన్ కల్యాణ్ సిఫార్సుతో రంగంలోకి వచ్చిన పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ నాని పరిస్థితిని గందరగోళంలో పడేశారు.
వ్యాపారవేత్త పొట్లూరి ప్రసాద్‌కి టిక్కెట్ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారని మీడియాలో వార్తలు రావడంతో కేశినేని నానికి షాక్ తగిలింది. ఆ తరువాత బాబుతో ఆయన భేటి అవ్వగా ఒత్తిళ్ల కారణంగా
సీటును ఇవ్వలేకపోతున్నానని, అర్థం చేసుకుని అసెంబ్లీకి పోటీ చేయాలని బాబు చెప్పిన నాని వినలేదు. విజయవాడ స్థానం నుంచే పోటీ చేస్తానని భీష్మించారు. ఆయనకు సర్ది చెప్పాలని బాబు ప్రయత్నించినప్పటికీ కేశినేని నాని దారిలోకి రాలేదు. నానీని మార్చడం సరికాదంటూ చంద్రబాబుపై స్థానిక నేతల నుంచి ఒత్తిడి, మీడియాలో కూడా పార్టీకి వ్యతిరేక వార్తలు రావటంతో సీను మారింది. దీంతో సాయంత్రం నానితో చర్చలు జరిపిన బాబు ఆయనకే సీటు ఇస్తానని చెప్పడంతో కథ సుఖాంతమైంది.