రేవంత్, సీతక్కలను చూసి నేర్చుకోండి.. కేశినేని నానికి తమ్ముడు చిన్ని హితవు
posted on Jan 11, 2024 @ 10:56AM
కేశినేని నాని, కేశినేని చిన్ని ఇద్దరూ అన్నదమ్ములు. ఒకరిది అహంకారం, ఆభిజాత్యం. మరొకరిది వినయం, ఒబ్డిడితనం. ఇద్దరి మధ్యా చాలా స్పష్టమైన తేడా ఉంది. కేశినేని నాని తెలుగుదేశం అభ్యర్థిగా రెండు సార్లు ఎంపీగా విజయం సాధించారు. 2019లో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది. విజయవాడ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఆరు అసెంబ్లీ స్థానాలలో తెలుగుదేశం ఓడిపోయింది. ఒకే ఒక్క స్థానంలో తెలుగుదేశం అభ్యర్థి గద్దె రామ్మోహనరావు విజయం సాధించారు. సాధారణంగా సార్వత్రిక ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరిగితే లోక్ సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన అభ్యర్థి తన నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీ అభ్యర్థుల విజయానికి తన వంతు సహకారం, సహాయం అందింస్తారు. ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీ అభ్యర్థుల విజయం, మెజారిటీపైనే లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థి విజయం, మెజారిటీ ఆధారపడి ఉంటుంది.
అలా చూసుకుంటే.. 2019 సార్వత్రిక ఎన్నికలలో విజయవాడ లోక్ సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన కేశినేని నాని నుంచి ఆ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీ చేసిన పార్టీ అభ్యర్థులకు ఎటువంటి సహకారం అందలేదు సరికదా కేశినేని నాని విజయానికి ఆయన లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి విజయం సాధించిన గద్దె రామ్మోహనరావు వల్లే దక్కిందని చెప్పాలి. ఔను ఆ ఎన్నికలలో కేశినేని నానికి వచ్చిన మెజారిటీ కేవలం 8726 ఓట్లు మాత్రమే. అంత తక్కువ మెజారిటీతో అయినా కేశినేని నాని గెలుపునకు, లోక్ సభ అభ్యర్థి సహాయ సహకారాలతో సంబంధం లేకుండా కేవలం తనకున్న ప్రజా బలంతో, పార్టీ దన్నుతో విజయం సాధించిన గద్దె రామ్మోహనరావు సెగ్మెంట్ లో నానికి అత్యధిక ఓట్లు పోల్ కావడమే కారణం అని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అదలా ఉంచితే.. 2019 ఎన్నికల అనంతరం కేశినేని నాని తీరు పార్టీకీ తీవ్ర నష్టం చేసిందనడంలో సందేహం లేదు. పార్టీ కంటే తానే అధికుడినన్నట్లుగా ఆయన వ్యవహరించిన తీరు, పార్టీ అధినేతపైనే పలు సందర్భాలలో చేసిన విమర్శలు, పార్టీ కార్యక్రమాలకు ఉద్దేశపూర్వకంగా దూరం ఉండటం ఇలా ఎలా చూసినా కేశినేని నాని అవసరం లేదని తెలుగుదేశం భావించడానికి ఆయనే పూర్తిగా కారణం.
అన్నిటికీ మించి అమరావతి ఉద్యమానికి కేశినేని దూరంగా ఉండటం, అదే సమయంలో అధికార పార్టీ నాయకులతో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరగడంతోనే పార్టీ విజయవాడ లోక్ సభ కు నాని వద్దు మరో అభ్యర్థిని నిలబెట్టాలన్న నిర్ణయానికి వచ్చింది. పూర్తిగా నాని వైఖరి వల్లే పార్టీ ఆ నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. ఆ విషయాన్నే పార్టీ అధినేత చంద్రబాబు ముగ్గురు సీనియర్ నాయకులను నాని ఇంటికి పంపి తెలియజేశారు. దాంతోనే తెలుగుదేశంతో నాని రాజకీయ ప్రయాణానికి ఫుల్ స్టాప్ పడింది. ఇన్నేళ్ల పాటు పార్టీలో ఉన్న నానికి తెలుగుదేశం అధినాయత్వం బర్త్ రఫ్ చేయకుండా ఆయనంతట ఆయనే వెళ్లిపోయే వెసులుబాటు కల్పించింది.
మరో వైపు ఇదే కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్ని మౌనంగా తన పని తాను చేసుకుంటున్నారు. విజయవాడ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం ఇన్ చార్జీలతో సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. అంతే కాకుండా నియోజకవర్గ పరిధిలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడం, వైద్య శిబిరాల నిర్వహణ, ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ముందుండటం వంటి కార్యక్రమాలతో ప్రజాభిమానాన్ని సొంతం చేసుకున్నారు. అలాగే స్వయానా తన అన్న కేశినేని నాని ఎన్నిరకాలుగా తనను ఇబ్బందులు పెట్టినా, పోలీసు కేసులు పెట్టి వేధించినా, రెచ్చగొట్టేలా ఎన్ని విమర్శలు చేసినా ఎప్పుడూ ఎక్కడా సంయమనం కోల్పోలేదు. అన్నను పన్నెత్తు మాట అనలేదు.
అయితే కేశినేని నాని జగన్ ను కలిసిన తరువాత మీడియా ఎదుట తెలుగుదేశంపై చేసిన విమర్శలకు మాత్రం సుతిమెత్తగా అయినా చాలా ఘాటుగా జవాబిచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆ రాష్ట్ర మంత్రి సీతక్కలను ఉదహరిస్తూ పార్టీ వీడిన తరువాత వ్యవహరించాల్సిన తీరు ఎలా ఉండాలో అన్నకు హితవు పలికారు.
రేవంత్ రెడ్డి, సీతక్కా ఇరువురూ కూడా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా వ్యవహరించిన వారే. అయితే తరువాత పార్టీ మారారు అయినా ఎక్కడా ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి కానీ, పార్టీ అధినేత చంద్రబాబుకు కానీ వ్యతిరేకంగా ఒక్కటంటే ఒక్క మాట అనలేదు. హుందాగా రాజకీయాలు చేశారు. వారిద్దరినీ ఉదాహరణగా చూపుతూ కేశినేని నాని కూడా హుందాతనంలో రాజకీయం చేయాలని కేశినేని శివ హితవు చెప్పారు.