ఆప్ ఓటమి సంపూర్ణం.. బీజేపీకి అధికారం పరిపూర్ణం!
posted on Feb 8, 2025 @ 3:50PM
మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లుగానే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయం సాధించి బీజేపీ అధికారంలోకి వచ్చింది. అధికార ఆప్ ఓటమి మూటగట్టుకుంది. మొత్తం మీద 27 ఏళ్ల తరువాత ఢిల్లీ పీఠంపై బీజేపీ జెండా ఎగురవేసింది. సహజంగానే ఇది బీజేపీ నేతలలో ఉత్సాహాన్ని నింపింది. ఆ పార్టీ నేతలూ, క్యాడర్ సంబరాలు చేసుకుంటున్నారు.
కాగా ఢిల్లీ ఎన్నికల ఫలితాలలో బీజేపీకి స్పష్టమైన ఆధిక్యత వచ్చింది. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల మేరకు బీజేపీ మొత్తం 70 స్థానాలలో 44 స్థానాలలో విజయం సాధించింది. మరో నాలుగు స్థానాలలో పూర్తి ఆధిక్యత కనబరుస్తోంది. ఇక ఆప్ 20 స్ధానాలలో విజయం సాధించింది. మరో రెండింటిలో ఆధిక్యంలో ఉంది. ఈ తరుణంలో ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఓటమిని అంగీకరిస్తూ ప్రకటన చేశారు. ఢిల్లీ ప్రజల తీర్పును తాను గౌరవిస్తున్నాననీ, ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తాననీ పేర్కొన్నారు. తాను తొలి నుంచీ చెబుతున్నట్లుగా ప్రజల పక్షాన పోరాడేందుకే తాను రాజకీయాలలోకి వచ్చినన్న కేజీవాల్ అధికారాన్ని ఆస్వాదించడానికి కాదన్నారు.
మరో వైపు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. అద్భుత విజయాన్ని అందించిన ఢిల్లీ ప్రజలకు కృతజ్ణతలు తెలిపారు. ఢిల్లీ అభివృద్ధికి, ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామన్నారు. వికసిత్ భారత నిర్మాణంలో ఢిల్లీ ప్రాధాన్యత ఎంతో ఉందన్నారు.