అమరావతి రైతుల దర్నాకు కేసీఆర్?
posted on Dec 16, 2022 @ 2:24PM
ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నారు. అయితే కేసీఆర్ ఇంట గెలిచారు. రచ్చ గెలవడానికి బయలు దేరారు. ఆ ప్రస్థానంలో ఇంటి గెలుపును వదులు కోవాల్సి వస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీ పేరు మార్చడానికి ముందు కేసీఆర్ తెలంగాణ సెంటిమెంటుకు బ్రాండ్ అంబాసిడర్. తెలంగాణ సాధించిన నేతగా, తెలంగాణ జాతి పితగా భుజకీర్తులున్న వ్యక్తి. అయితే ఎప్పుడైతే జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారో.. అప్పటి నుంచీ అనివార్యంగా తనపై ఉన్న తెలంగాణ ముద్రను వదుల్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న లక్ష్యంతో కూటమి, ఫ్రంట్, టెంట్ అంటూ దేశం చుట్టేసిన కేసీఆర్.. ఆ సందర్భంలోనే తెరాసను ఉద్యమ పార్టీ కాదు ఫక్తు రాజకీయ పార్టీ అంటూ ప్రకటించి.. తెలంగాణ ఉద్యమంతో పార్టీకి ఉన్నబంధాన్ని తెంచేశారు.
దీంతో కేసీఆర్ తెరాసను ఫక్తు రాజకీయ పార్టీగా ప్రకటించిన నాటి నుంచి పేరులో తప్ప తెరాసలో తెలంగాణకు స్థానం లేని పరిస్థితి ఏర్పడింది. అందుకే ప్రజా వ్యతిరేకతను గుర్తించి మరో మారు తెరాస సెంటిమెంటును పండించేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. తెలంగాణ ఉద్యమంతో పార్టీకి ఉన్న అనుబంధం పుటుక్కున తెగిపోయిందని గ్రహించిన కేసీఆర్.. ఇక ఫ్రంట్, టెంట్ లతో పని కాదన్న నిర్ణయానికి వచ్చేశారు. రాష్ట్రంలో నిలబడాలంటే టీఆర్ఎస్ కాదు జాతీయ పార్టీయే శరణ్యమని భావించారు. అందుకే ప్రిపరేషన్స్ పూర్తి కాకపోయినా.. కలిసి వచ్చే వారెవరో.. కాదు పొమ్మనే వారెవరో తేల్చుకోకుండానే టీఆర్ఎస్ ను కాలగర్భంలో కలిపేసి బీఆర్ఎస్ అంటూ పాత సినిమానే కొత్తగా తెరమీదకు తీసుకు వచ్చారు. సరే ఆ తరువాత జరిగిందేమిటో? జరుగుతున్నదేమిటో అందరూ తెర మీద చూస్తున్నారు. అది వేరే సంగతి.
బీఆర్ఎస్ భవిష్యత్ ఏమిటన్నది చాలా వరకూ పార్టీకి నామకరణం చేసిన రోజునే తేలిపోయింది. ఇంకా ఏమైనా మిగిలి ఉంటే అధికారికంగా పార్టీని ప్రకటించిన రోజు అందరికీ అవగతమైపోయింది. ఇంకా మిగిలి ఉన్న దింపుడు కళ్లెం ఆశను హస్తిన లో పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవ వేడుక చంపేసింది. దీంతో పేరు బీఆర్ఎస్..సరే ఊరేదంటే మాత్రం చెప్పుకోవడానికి ఒక్క రాష్ట్రమూ మిగలని పరిస్థితి. ఇప్పటికే తెలంగాణయే దిక్కు అంటే మాత్రం తెరాస పేరు మార్చాల్సిన అవసరమేమిటని సొంత ఎమ్మెల్యేలూ, మంత్రులే నిలదీసే పరిస్థితి. అందుకే కేసీఆర్ ఎవరూ వచ్చి కలవకున్నా.. కనీసం గుర్తించకున్నా ఇంకా హస్తినలోనే మకాం వేశారు.
ఒక్క అవకాశం.. ఒకే ఒక్క అవకాశం అన్నట్లు ఆశగా ఇతర రాష్ట్రాలు, పార్టీల కేసి చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయనకు అంతో ఇంతో అనువుగా కనిపిస్తున్న రాష్ట్రం సాటి తెలుగు రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ మాత్రమే. అక్కడ తానాడమన్నట్లు ఆడే ప్రభుత్వం ఉందని కేసీఆర్ భావిస్తున్నారు. కానీ రాష్ట్రంలో అడుగు పెట్టేందుకు అయితే చెప్పినట్లు నడుచుకునే నేత అక్కడ అధికారంలో ఉంటే సరిపోతుంది. కానీ నిలదొక్కుకోవాలంటే.. జనానికి నచ్చే కార్యాచరణ చూపాలి. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ.. తొలి సారి అధికారం చేపట్టిన తొలి రోజుల్లోనూ.. ఆంధ్రోళ్లు అంటూ తెరాస అధినాయకుడు, ఆ పార్టీ నేతలూ చేసిన వ్యాఖ్యలు, విమర్శలు, చూపిన వివక్ష ఏపీ జనం ఈ ఎనిమిదిన్నరేళ్లలో మరిచిపోయి ఉంటారని కేసీఆర్ కూడా భావించడం లేదు.
అందుకే ఇప్పుడు ఏపీ సీఎం తోడు ఒక్కటి చాలు అని ఆయన భావించడం లేదు. మరి ఏపీలో జనం మనసులను గెలుచుకోవడానికి ఏం చేస్తారు? ఇప్పుడు ఆయనకు ఆ దిశగా కనిపిస్తున్న ఒకే ఒక ఆశాకిరణం అమరావతి రైతుల ఆందోళన. అమరావతి శంకుస్థాపనకు స్వయంగా వచ్చిన సందర్భం. ఆ తరువాత ఇన్నేళ్లలోనూ ఎన్నడూ అమరావతి రాజధాని అంశానికి వ్యతిరేకంగా మాట్లాడలేదన్న ధైర్యం. అందుకే ఆయన ఏపీలో అడుగు పెట్టేందుకు అమరావతి రైతులకు మద్దతు ప్రకటించడమే ఏకైక మార్గంగా ఎంచుకున్నారని రాజకీయ నిపుణులు సైతం విశ్లేషిస్తున్నారు.
ఆయన పెద్దగా పనులేమీ లేకపోయినా.. తెలంగాణలో పాలనను గాలికి వదిలేసి హస్తినలోనే మకాం వేయడానికి కారణం కూడా అమరావతి రైతులేనని చెబుతున్నారు.జగన్ తో ‘రహస్య’చెలిమి ఉభయ రాష్ట్రాలలోనూ బహిరంగంగా అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తమ రహస్య చెలిమికి చెల్లు చీటీ ఇచ్చేసైనా సరే అమరావతి రైతులకు మద్దతు పలకడమే మేలా అన్న యోచనలో కేసీఆర్ ఉన్నారు. అందుకే ధర్నా కోసం అమరావతి రైతులు ధరణి కోట టు ఎర్రకోట అంటూ హస్తిన చేరుకున్న సందర్భాన్ని రాజకీయంగా తనకు తెలంగాణలో ఏదో మేర మద్దతు దొరికేందుకు ఒక అవకాశంగా ఉపయోగించుకోవాలని యోచిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే జంతర్ మంతర్ వద్ద శనివారం (డిసెంబర్ 17) అమరావతి రైతుల ధర్నాకు కేసీఆర్ హాజరై మద్దతు పలికే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు. దీని ద్వారా బీఆర్ఎస్ కు ఏపీలో అడుగు పెట్టేందుకు ఒక స్పేస్ సృష్టించుకున్నట్లు అవుతుందని భావిస్తున్నారు. అమరావతి రైతుల ధర్నా వద్దకు కేసీఆర్ వచ్చి మద్దతు ప్రకటిస్తే.. ఏపీలో రాజకీయ సమీకరణాలలో గుణాత్మక మార్పు తథ్యమని అంటున్నారు.
అదే జరిగితే జగన్ కు ఏపీలో ఇప్పటికే ఉన్న ప్రత్యర్థులు తెలుగుదేశం, జనసేనలకు తోడుగా బీఆర్ఎస్ వచ్చి చేరుతుంది. ఒక వేళ తెలుగుదేశం, జనసేనలకు పొత్తు పెట్టుకుని పోటీలో దిగినా.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును భారీగా చీల్చేందుకు బీఆర్ఎస్ దోహదపడుతుందని, ఇది ఒక రకంగా బయటకు జగన్ కు ప్రత్యర్థిగా నిలబడినట్లు కనిపించినా.. అంతర్గతంగా ఏపీ సీఎంకు మేలు చేయడమే అవుతుంది. అసలు అదే వ్యూహంతో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ అడుగులు వేస్తున్నారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.