కేటీఆర్ కు పగ్గాలు... హరీష్ కు జాతీయ బాధ్యతలు.. కేసీఆర్ వ్యూహమిదేనా?
posted on Nov 14, 2022 @ 9:30AM
ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి స్థాయిలో జాతీయ రాజకీయాల్లో మునిగి పోవడం ఖాయంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ ప్రకటన తరువాత నుంచే కేసీఆర్, రాష్ట్రంలో కంటే ఢిల్లీలో, కాదంటే ఇతర రాష్ట్రాల పర్యటనలలోనే ఎక్కువగా ఉంటారనే సంకేతాలు విస్పష్టంగా కనిపించాయి. ఆ పర్యటనల కోసమే ‘ఛార్టర్డ్ ఫ్లైట్’ ను కూడా కొనుగోలు చేసి సిద్ధం చేసుకున్నారు. ఈ నేపధ్యంలో, రాష్ట్ర రాజకీయాల్లో, మరీ ముఖ్యంగా అధికార పార్టీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకునే అవకాశాలపై తెరాస శ్రేణుల్లోనే కాదు పరిశీలకుల్లోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వాస్తవానికి దసరా రోజున కేసీఆర్ బీఆర్ఎస్ ఆవిర్భావ ప్రకటన రోజునే ఈ సంకేతాలు ఇచ్చారు.
పార్టీ ముఖ్య నేతలకు బీఆర్ఎస్ లో కీలక బాధ్యతలను అప్పగిస్తాననీ చెప్పారు. ఈ నేపద్యంలో, కొందరు ‘ముఖ్య’ నేతలను ఇక్కడి బాధ్యతల నుంచి తప్పించి, జాతీయ బాధ్యతలు అప్పగించడమో, లేక రాష్ట్ర బాధ్యతలకు అనుగుణంగా జాతీయ బరువును అదనంగా వారి మీద మోపడమో అనివార్యమన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. మునుగోడు ఉప ఎన్నిక కారణంగా జాతీయ కార్యాచరణ వేగం ఒకింత తగ్గిందని పార్టీ శ్రేణులే అంటున్నాయి. ఇప్పుడిక మునుగోడు ఉప ఎన్నిక ఫలితం అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో కేసీఆర్ జాతీయ రాజకీయాలలో దూకుడు పెంచే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
అందులో భాగంగానే మంగళవారం (నవంబర్ 15) పార్టీ లెజిస్లేచర్ పార్టీ, పార్లమెంటు సభ్యులు, కార్యవర్గ సభ్యుల సమావేశం ఏర్పాటు చేశారని కూడా అంటున్నారు. ఈ సమావేశంలోనే పార్టీ, ప్రభుత్వ బాధ్యతల బదలీపై ప్రకటన కూడా జరిగే అవకాశం ఉందంటున్నారు. అన్నిటికీ మించి ముఖ్యమంత్రి కేసీఆర్, ఒక మాట మాట్లాడారంటే, ఆ మాటకు టీకా తాత్పర్యం, నానార్దాలు చాలానే ఉంటాయని తెరాస శ్రేణులే అంటున్నాయి. అలాగే, ఇప్పడు, ముఖ్యమంత్రి పార్టీ నేతలు జాతీయ బాధ్యతలకు సిద్ధం కావాలని సంకేత మాత్రంగా చేసిన వ్యాఖ్యల వెనక ప్రత్యేక లక్ష్యం ఏదో ఉండే ఉంటుందంటున్నారు. ఆ అక్ష్యం ఏమిటన్నదానిపై పలు రకార ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే కేసీఆర్ ఏ ఉద్దేశంతో సీనియర్ నేతలకు జాతీయ బాధ్యతలు అన్నారన్న విషయం మంగళవారం (నవంబర్ 15) జరిగే కీలక సమావేశంలో తేలిపోనుంది.
అయినా ముఖ్యమంత్రి ‘జాతీయ బాధ్యతలు’ అన్న మాటలో అలాంటి అర్థాలు ఉన్నా, లేకున్నా నిజంగా సీరియస్ గా జాతీయ రాజకీయాల్లో ముందుకు పోవాలంటే,అది కేవలం కేసీఆర్ వల్ల అయ్యే పని కాదు, ఒకరిద్దరు కాదు.. చాలా మంది చాలా త్యాగాలు చేయవలసి ఉంటుందని, ముఖ్యంగా తెరాస నిర్మాణం నుంచీ కీలకంగా వ్యవహరించిన హరీష్ రావు వంటి ముఖ్య నేతలు ముందుగా త్యాగాలకు సిద్ధం కావాల్సి ఉంటుంది. అందుకే కేసీఆర్ రాష్ట్ర నాయకులకు జాతీయ బాధ్యతలు అనగానే పార్టీలో, పరిశీలకుల్లో ఎన్నో రకాల సందేహాలు, అనుమానాలు వ్యక్తమయ్యాయి. త్యాగాలకు సిద్ధం కావాల్సిన నేత లెవరన్న చర్చలూ సాగాయి.
ఇప్పటికే ఢిల్లీ రాజకీయలలో సంబంధాలున్న వినోద్ కుమార్, ప్రస్తుత మాజీ ఎంపీలతో పాటుగా సంస్థాగత నిర్మాణంలో,. సంస్థాగత వ్యవహారాలను చక్క పెట్డంలో ప్రతిభ చాటిన హరీష్ రావు వంటి వారి అవసరం జాతీయ పార్టీకి మరింత ఎక్కువ ఉంటుందని అంటున్నారు. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు అన్ని విధాల నమ్మిన బంటుగా ఉండే మేనల్లుడు హరీష్ రావుకే బీఆర్ఎస్ కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయని పార్టీ శ్రేణులు కూడా భావిస్తున్నాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్, జాతీయ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే, ఆటోమేటిక్’గా ప్రస్తుతం సెకండ్ ఇన్ కమాండ్ గా ఉన్న తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, కేటీఆర్ జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పగ్గాలు చేపడతారు.
అలాగే, ముఖ్యమంత్రి జాతీయ రాజకీయాలో బిజీ అయిన తర్వాత, అవసరాన్ని బట్టి, ముఖ్యమంత్రి పదవి కూడా కేటీఆర్ కే దఖలు పడతాయి. అదే జరిగితే, జాతీయ స్థాయిలో కేసీఆర్ నాయకత్వంలో, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేటీఆర్ నాయకత్వంలో ఎన్నికలకు వెళితే, ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి ఎవరనే, ప్రశ్న రాకుండా, ముందుకుసాగి పోయే అవకాశం ఉంటుందన్నది కేసీఆర్ వ్యూహంగా చెబుతున్నారు. అదే సమయంలో పార్టీకి కొంతలో కొంత కేటీఆర్ కు పోటీగా ఉంటారని భావించే హరీష్ రావును దూరం పెట్టడంలో భాగంగానే హరీష్ రావుకు జాతీయ బాధ్యతలు అప్పగించడమే మేలన్నది కూసీఆర్ వ్యూహంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.