పీకేని కేసీఆర్ పీకేశారా?
posted on Sep 23, 2022 7:25AM
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే)ని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దూరం పెట్టారా? మీకూ మీ సర్వేలకూ ఓ దణం అంటూ పీకేని తెరాస ఎన్నికల వ్యూహకర్త పోస్టు నుంచి పీకేశారా? జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఔనని అనిపించక మానదు. పీకే టీం సర్వేలు, సేవలు ఇక అవసరం లేదని కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చేశారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. పీకే బృందం సర్వేలు అవసరం లేదనీ పీకేకు ఖరాఖండీగా చెప్పేయడంతో ఇక టీఆర్ఎస్ తో పీకే బంధం తెగిపోయినట్లేనని అంటున్నారు.
ఆఖరికి మునుగోడు ఉప ఎన్నిక కు కూడా ఐప్యాక్ సేవలు అవసరం లేదని ముఖ్యమంత్రి చెప్పడంతో తెలంగాణలో పీకే టీంకు పని లేకుండా పోయింది. కారణాలేవైనా ఈ పరిణామం పట్ల తెరాస శ్రేణులు, నేతలు, ముఖ్యంగా సిట్టింగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా ఇలా హఠాత్తుగానే తీసుకుంటారని పార్టీ శ్రేణులే అంటున్నారు. ఆయన ఆగ్రహం అయినా, అనుగ్రహం అయినా ఒకింత తీవ్ర స్థాయిలోనే ఉంటుందని చెబుతుంటారు. పీకేను టీఆర్ఎస్ వ్యూహకర్తగా నియమించిన సమయంలో ఆయనకు ప్రగతి భవన్ లోనే బస ఏర్పాటు చేసి, వీఐపీ ట్రీట్ మెంట్ ఇచ్చిన కేసీఆర్.. తన జాతీయ రాజకీయ ప్రవేశానికి అవసరమైన సలహాలూ, సూచనలూ తీసుకున్నారని చెబుతారు.
అంతేనా.. రాష్ట్రంలో టీఆర్ఎస్ ముచ్చటగా మూడో సారి అధికారంలోకి రావాలంటే పీకే వ్యూహాలను తు.చ. తప్పకుండా అనుసరించాల్సిందేనని పార్టీ ముఖ్యులకే తేల్చి చెప్పేశారు. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ టికెట్లు ఇచ్చేది కూడా పీకే టీం సర్వేల ఆధారంగానేనని తేల్చి చెప్పేశారు. చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాలలో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని పీకే టీం సర్వేలు వెల్లడించాయని, వారందరికీ టికెట్లు ఇచ్చేది లేదనీ కూడా ప్రకటించేశారు. కేసీఆర్ కుమారుడు, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అయితే ఏకంగా ఒక సభలోనే పీకే సర్వేల ఆధారంగానే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ టికెట్లు ఇస్తామని చెప్పేశారు.
ఇంతటి ప్రాధాన్యత ఇచ్చి.. అంత హఠాత్తుగా కేసీఆర్ పీకేకు ఎందుకు బైబై చెప్పేశారన్న సందేహం పార్టీ శ్రేణుల్లో కలుగుతున్నప్పటికీ.. పీకేను కేసీఆర్ పక్కన పెట్టేయడం పట్ల పార్టీ నేతల్లో ముఖ్యంగా సిట్టింగులలో ఆనందం వ్యక్తం అవుతోంది. ఇంతకీ పీకేను కేసీఆర్ పక్కన పెట్టేయడానికి ఇటీవల తెలంగాణలో పీకే టీం సర్వేలు టీఆర్ఎస్‌కు నెగెటివ్ గా ఉండటమే కాకుండా, ఆ సర్వేలు లీక్ అవ్వడం సామాజిక మాధ్యమంలో వైరల్ అవ్వడం కారణమని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. పార్టీ కోసం రహస్యంగా చేయించిన సర్వేలను పీకే లీక్ చేయడం పట్ల కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారంటున్నారు.
ఆ కారణంగానే పీకే సేవలకు ఇక సెలవు అన్న నిర్ణయానికి వచ్చేశారని చెబుతున్నారు. పీకేను పీకేయడం పట్ల తెరాస సిట్టింగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ అయినా తమకు పార్టీ టికెట్లను నిర్ణయించేది పీకేయే అన్నంతగా బిల్డప్ ఇవ్వడంతో సిట్టింగులు ఇంత కాలం ఆందోళనలో ఉన్నారు. పీకే సర్వేలేమిటో.. అవి తేల్చేదేమిటో అని వారిలో వారు మథన పడ్డారు. ఇప్పుడు కేసీఆర్ పీకే సేవలు అవసరం లేదని నిర్ణయించడంతో వారు ఆనందంలో ఉన్నారు.