గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వఘేలాతో కేసీఆర్ భేటీ
posted on Sep 16, 2022 @ 6:07PM
జాతీయ రాజకీయాల విషయంలో కేసీఆర్ తగ్గేదే లే అన్నట్లుగా ముందుకు సాగుతున్నారు. అడ్డంకులు, అవాంతరాలు, పరాభవాలు, ప్రతి కూలతలూ ఎదురౌతున్నా ఇసుమంతైనా లేక్క చేయకుండా ముందుకే సాగుతున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ఈడీ దాడుల ప్రకంపనలను ఇసుమంతైనా పట్టించుకోకుండా జాతీయ రాజకీయాలకు సంబంధించి వరుస చర్చలలో మునిగిపోతున్నారు. ఇరత రాష్ట్రాల నుంచి వచ్చిన నేతలు, రైతు ప్రతినిథులు, రాజకీయ పార్టీల నేతలు, మాజీ ముఖ్యమంత్రులతో వరుస భేటీలు జరుపుతున్నారు.
తాజాగా శుక్రవారం (సెప్టెంబర్16) ఆయన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వఘేలాతో భేటీ అయ్యారు. ప్రగతి భవన్ లో జరిగిన ఈ బేటీలో దేశ రాజకీయాలు, జాతీయ అంశాలపై చర్చించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ విధానాలపైనా ఇరువురి మధ్యా చర్చ జురిగిందని చెబుతున్నారు. జాతీయ స్థాయిలో రాజకీయాలలో మార్పు రావాలంటే.. కేంద్రంలో అధికారం మారాల్సిందేనన్న కృత నిశ్చయంతో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆ దిశగా అందరితో జరుపుతున్న సమాలోచనలలో భాగంగానే శంకర్ సింగ్ వఘేలాతో భేటీ అయ్యారని ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్ నేతతో కేసీఆర్ భేటీ కావడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వఘేలా తాను కొత్తపార్టీ పెట్టగబోతున్నట్లు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన తన పార్టీ తరఫున రాష్ట్రంలోని మొత్తం అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ(182) అభ్యర్థులను నిలుపుతానని ప్రకటించిన సంగతి విదితమే.
ఈ నేపథ్యంలోనే ఆయన హైదరాబాద్ వచ్చి కేసీఆర్ తో భేటీ కావడం రాజకీయంగా అందరిలోనూ ఆసక్తి నెలకొంది. 2024 ఎన్నికలలో కేంద్రంలోని మోడీ సర్కార్ ను గద్దె దించడమే ధ్యేయంగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. బీజేపీ ముక్త భారత్ నినాదంతో ముందుకు సాగుతున్న కేసీఆర్ ఇప్పటికే బీహర్, బెంగాల్, కేరళ, తమిళనాడు, రాష్ట్రాల సీఎంలతో భేటీ అయ్యారు. బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీల నేతలతో చర్చలు జరిపారు. అలాగే కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితోనూ ఇటీవలే భేటీ అయ్యారు. ఇప్పుడు గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వఘేలాతో చర్చలు జరిపారు. దసరా లోపుగానే కేసీఆర్ జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించే అవకాశం ఉందని భావిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ కలసివచ్చే పార్టీలూ నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే నెలలో విజయవాడలో జరగనున్న సీసీఐ జాతీయ సమావేశానికి కేసీఆర్ కు ఆహ్వానం అందింది. సీపీఐ జాతీయ సమావేశాలలో భాగంగా బీజేపీ, కాంగ్రెస్సేతర నాయకులతో సీపీఐ నేతలు ఒక సమావేశం నిర్వహించనున్నారు. ఆ సమావేశానికే కేసీఆర్ ను కూడా ఆహ్వానించారు.