భాష గురించి సుద్దులేంటి? గతాన్ని మర్చిపోయారా కేసీఆర్?
posted on Mar 15, 2024 @ 10:44AM
బేకూబ్ గాళ్లు.. పనికిమాలిన దద్దమ్మలు.. సన్నాసులు.. ముండమోపులు.. నా కొడుకులు.. ఇలా చెప్పుకుంటూ పోతే బీఆర్ ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నోటి నుంచి జాలువారే పదాలు చాలానే ఉన్నాయి. బీఆర్ ఎస్ అధికారంలో ఉన్నసమయంలో ఒకానొక దశలో ఇదే తెలంగాణ భాష అన్నట్లుగా సీఎం హోదాలో కేసీఆర్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. గత పదేళ్ల కాలంలో బీఆర్ ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ మీటింగ్ అంటే మీడియాలో రాయలేనిపదాలతో సైతం ప్రతిపక్షాలపై విరుచుకుపడేవారు. ప్రతిపక్షాలు ఆయన భాషపై అభ్యంతరం చెబితే.. చావు నోట్లో తలకాయపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాను.. నాకే ఎదురు చెబుతారా అంటూ మళ్లీ ప్రతిపక్షాలపైనే విరుచుకుపడేవారు. వరుసగా రెండు సార్లు అధికారం రావడంతో కేసీఆర్, బీఆర్ ఎస్ నేతలు తాము ఏం మాట్లాడినా చెల్లబాటు అవుతుందనే స్థాయికి వెళ్లిపోయారు. ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. ప దేళ్ల కేసీఆర్ పాలనలో అనేక ఇబ్బందులు పడ్డ ప్రజలు.. ఆయన్ను గద్దెదించారు. మరి కొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి వరుసగా బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో రేవంత్ వాడుతున్న పదజాలంపై కేసీఆర్ గగ్గోలు పెడుతున్నారు. అయితే కేసీఆర్ గతాన్ని మర్చిపోయి.. రేవంత్ అలా మాట్లాడుతున్నారు.. ఇలా మాట్లాడుతున్నారు.. తాను ముఖ్యమంత్రిగా ఉండగా ఒక్క పొల్లుమాటైనా నా నోట వచ్చిందా అంటుండటం గమనార్హం.
కత్తితో కోసినట్లుగా ఉండే మాటలు.. సిగ్గుతో తల ఎత్తుకోలేని విధంగా ఉండేలా భాష.. తన రాజకీయ ప్రయోజనంకోసం ఎవరినైనా సరే బండకేసి బాదినట్లుగా మాటలతో బాదేయగల సత్తా కేసీఆర్‌ది. మోడీ సర్కార్ పై కోపం వస్తే కమలనాథులను కసిగా తిట్టేవారు.. కాంగ్రెస్ నేతలనైతే ఇక చెప్పటానికి వీళ్లేదు.. కేసీఆర్ కు ఆవేశం వచ్చినా.. ఆక్రోశం వచ్చినా ఆయన నోటి నుంచి జాలువారే పదాలు తెలంగాణ సమాజం తలదించుకునేలా ఉండేవి.. అదేం భాష అని ప్రశ్నించిన వారిపైకూడా ఎదురుదాడికి దిగేవారు.. మరో అడుగు ముందుకేసి ఇదే తెలంగాణ భాష అంటూ సర్టిఫికెట్లు సైతం ఇచ్చుకున్న ఘనత కేసీఆర్‌ది. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన సమయంలో కేసీఆర్ ఏం మాట్లాడినా చెల్లింది. కానీ, అధికారంలోకి వచ్చిన తరువాత గడిచిన పదేళ్ల కాలంలో కేసీఆర్ భాష తీరులో మార్పు రాలేదు. దీంతో ముల్లును ముల్లుతోనే తీయాలన్న సామెతను వంటబట్టించుకున్న ప్రతిపక్ష పార్టీల్లోని ఇద్దరుముగ్గురు నేతలు కేసీఆర్ కు ఆయన భాషలోనే సమాధానం చెప్పేవారు. దీంతో.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తనపై, సీఎం పై తిపక్ష నేతలు ఇలా మాట్లాడటం ఏమిటంటూ కేసీఆర్ మళ్లీ తనదైన రీతిలో పదజాలాన్ని వినియోగిస్తూ విమర్శలు చేసేవారు. కేసీఆర్ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలోనూ ఇదే తంతు కొనసాగింది. ఉన్నట్లుండి కేసీఆర్ కు జ్ఞానోదయం అయినట్లుంది. ప్రతిపక్షంలోకి వచ్చిన తరువాత ఆయన గతాన్ని మర్చిపోయినట్లుగా ప్రవర్తిస్తున్నారు.
పదేళ్లు సీఎంగా కొనసాగిన కేసీఆర్ ప్రతిపక్షాలపై, మీడియాపైనా పరుష పదజాలంతో మాట్లాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కేసీఆర్ భాషతీరు, అధికారంలో ఉన్నప్పుడు తాను ఏం చెప్పినా వినాలన్న కేసీఆర్ ధోరణితో విసిగిపోయిన తెలంగాణ ప్రజలు ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. దీంతో ప్రజామద్దతు పెరుగుతోంది. దీన్నిచూసి ఓర్వలేని బీఆర్ ఎస్ నేతలు ప్రభుత్వాన్ని పడగొడతాం అంటూ పదేపదే వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో కేసీఆర్ కు ఆయన భాషలోనే సమాధానం ఇవ్వాలని రేవంత్ రెడ్డి దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ వాడిన భాషను రేవంత్ వాడుతూ బీఆర్ ఎస్ నేతల నోళ్లు మూయిస్తున్నారు. ఈ క్రమంలో.. ఉన్నట్లుండి కేసీఆర్ కు జ్ఞానోదయం అయినట్లుంది. సీఎం హోదాలోఉన్న వ్యక్తి ఎలా మాట్లాడాలి.. హూందాతనం అంటే ఏమిటి అనే విషయాలపై బహిరంగ సభల్లో మైకులో సెలవిస్తున్నారు. తెలంగాణ సమాజానికి ఇది గౌరవమా? దయచేసి ప్రజలు గమనించాలి అంటూ కేసీఆర్ విజ్ఞప్తి చేస్తున్నారు. అంటే.. కేసీఆర్ ఎలాంటి భాషను మాట్లాడినా సంసారపక్షం.. అదే ఇతర పార్టీల నేతలు మాట్లాడితే బూతులు అన్నట్లుగా కేసీఆర్ ప్రవర్తిస్తుండటంతో ప్రజలుసైతం షాక్ కు గురవుతున్నారు. అధికారంలో ఉన్న సమయంలో నువ్వు వాడిన భాషనే కదా ఇది అంటూ గుర్తుచేస్తున్నారు.
మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో కేసీఆర్ ప్రజల్లో సానుభుతిని రగిల్చి అత్యధిక స్థానాల్లో బీఆర్ ఎస్ అభ్యర్థులు విజయం సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన కేసీఆర్.. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న భాష సరిగా లేదంటూ గగ్గోలు పెట్టారు. తెలంగాణకు ఇది గౌరవప్రదంగా ఉంటుందా.. సీఎం స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడవచ్చా అంటూ ప్రజల్లో సానుభూతిని పొందేలా కేసీఆర్ ప్రయత్నాలు చేశారు. ఇక్కడ కేసీఆర్, బీఆర్ ఎస్ నేతలు తెలుసుకోవాల్సింది ఏమిటంటే.. అసభ్యకర భాషను వాడింది ముందు కేసీఆర్, బీఆర్ ఎస్ నేతలే. సన్నాసులు, దద్దమ్మలు, పోరంబోకులు, కుక్కలు, గాడిదలు అన్నది ఎవరు? అంటే తెలంగాణలోని ప్రతి ఒక్కరూ కేసీఆర్ అనే చెబుతారు. ఆ తరువాత తప్పనిసరి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి కేసీఆర్ తరహా భాషను వాడాల్సి వచ్చిందని ప్రజలందరికీ తెలిసిందే. ఇప్పటికైనా మనం ప్రతిపక్షంలో ఉన్నామని గుర్తుచేసుకొని కేసీఆర్, బీఆర్ ఎస్ నేతలు తమ భాషను మార్చుకుంటే.. కాంగ్రెస్ నుంచి సైతం మంచి పద్దతిలోనే సమాధానం వస్తుంది. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి పలు సభల్లోనూ ప్రస్తావించారు. అవేమీ పట్టించుకోకుండా కేసీఆర్ తాజాగా రేవంత్ భాష గురించి సుద్దులు చెప్పడంతో సోషల్ మీడియాలో గతంలో కేసీఆర్ అనుచిత భాష ప్రయోగిస్తూ చేసిన వీడియోలు తెగ హల్ చ ల్ చేస్తున్నాయి.