కేసేఆర్ సర్కార్ కు ఢిల్లీ సెగ
posted on Mar 14, 2023 @ 4:47PM
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు కేంద్ర ప్రభుత్వం పై రాజకీయ యుద్ధం ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఒకదాని తర్వాత ఒకటిగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనత పార్టీ (బీజేపీ)ని ఇరకాటంలో నెట్టేందుకు, కేసీఆర్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.
కానీ, కాలం కలిసి రాకపోతే, తాడే ... పామవుతుంది అన్నట్లు, కేసీఆర్ వ్యూహాలు ఎదురు తిరుగుతున్నాయని బీఆర్ఎస్ నాయకులే ఆందోళన వ్యక్త పరుస్తున్నారు. ఒకప్పుడు కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి, నువ్వు గోకినా గోకకపోయినా, నేను మాత్రం నిన్ను గోగుతూనే ఉంటా అన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే, కథ రివర్స్ లో నడిస్తున్నట్లుంది. ఇప్పటికే ఒక వంక ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీబీఐ, ఈడీ విచారణ ఎదుర్కుంటున్నారు.
ఆ కేసు ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటుందో, ఏ మవుతుందో తెలియని పరిస్థితి. మరో వంక ఫార్మ్ హౌస్ (ఎమ్మెల్యేల బేర సారాల) కేసులోనూ సుప్రీంలో చుక్కెదురైంది. సీబీఐ విచారణను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సీబీఐ విచారణ జరుపుతుందా లేదా అనేది పక్కన పెడితే, ఫార్మ్ హౌస్ కేసులో బీజేపీని బద్నాం చేసేందుకు చేసిన ప్రయత్నాలు బూమరాంగ్ అయ్యింది. ఈ కేసులో ముఖ్యమంత్రి అతి ఉత్సాహాన్ని సుప్రీం కోర్టు తప్పు పట్టింది. చక్కగా చీవాట్లు పెట్టింది. అంతే కాదు, ఎంతవరకు నిజమో ఏమో కానీ, ప్రభుత్వ వ్యతిరేక ఓటును ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఓటు బ్యాంకు, రెడ్డి ఓటు బ్యాంకును చీల్చేందుకు, ముఖ్యమంత్రి కేసేఆర్ వైఎస్ షర్మిలను రంగంలోకి దించారని అంటారు.
రాష్ట్రంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ ( వైఎస్సార్ టీపీ) స్థాపించేందుకు, ఆమె సాగిస్తున్న పాద యాత్రకు వెనక నుంచి అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తోంది బీఆర్ఎస్ పెద్దలే అంటారు. అయితే, ఇప్పడు అదే షర్మిల , ఏకుమేకై కూర్చున్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళన చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని, దీనిపై సీబీఐ, ఈడీలతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై విచారించాలని కోరారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు, కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో అంటూ నినాదాలు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ వేల కోట్ల కమిషన్లు దండుకున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. రీ డిజైనింగ్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని మూడు రెట్లు పెంచారని చెప్పారు. కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని మరోసారి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద స్కామ్ అని వైఎస్ షర్మిల ఆరోపించారు. ప్రజల సొమ్ము లక్షల కోట్లను కేసీఆర్ దోచుకున్నారని ఆరోపించారు. 38 వేల కోట్ల ప్రాజెక్టును లక్షా 50 వేల కోట్లకు పెంచారని చెప్పారు. మూడు సార్లు ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని పెంచారన్నారు.
ప్రాజెక్టు వల్ల చాలా మంది నిరాశ్రుయులయ్యారని, వారికి ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయలేదని వైఎస్ షర్మిల అన్నారు. నాణ్యత లేకుండా ప్రాజెక్టు కట్టారని, ప్రతి ఏటా వేల ఎకరాల పంట పొలాలు మునిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక అద్భుతమంటూ కేసీఆర్ తెలంగాణతో పాటు దేశ ప్రజలను సైతం మోసం చేశారని మండిపడ్డారు. ప్రాజెక్టు నిర్మాణంలో రూ.70 వేల కోట్ల అవినీతి జరిగిందనీ, 2జీ, బొగ్గు కుంభకోణం కంటే.. ఇది పెద్ద స్కామ్ అని ఆరోపించారు. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినితీ చోటు చేసుకుందని కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా ఆరోపిస్తున్నారు. ఇప్పడు షర్మిల ధర్నాతో, కేంద్రం కదిలితే, ముఖ్యమంత్రి బీఆర్ఎస్ ప్రభుత్వం మరో విచారణకు సిద్దం కావలసి ఉంటుందనడంలో సందేహం లేదు.