అది అధికారిక యాత్రా? విహార యాత్రా?
posted on Sep 17, 2015 @ 8:22PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చైనా పర్యటనను ముగించుకుని, హైదరాబాద్ తిరిగొచ్చేసినా విమర్శలు మాత్రం ఆగడం లేదు. అది అసలు ప్రభుత్వ అధికారిక యాత్రా? లేక విహార యాత్రకు వెళ్లారా అంటూ కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి విమర్శించారు. కేసీఆర్ విహార యాత్రకు వెళ్లినట్లుందని, అది పెట్టుబడులను ఆకర్షించడానికి వెళ్లినట్లు లేదని ఎద్దేవా చేశారు. చైనా టూర్ కి వెళ్లిన వారిని చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారన్న ఆయన, అంతమందిని అసలు ఎందుకు తీసుకెళ్లారో, వాళ్లకున్న అర్హతలేంటో? తెలియడం లేదన్నారు. కేసీఆర్ చైనా టూర్ కోసం ఖర్చు పెట్టిన డబ్బును, రైతుల కోసం ఉపయోగించి ఉంటే, కనీసం ఆత్మహత్యలైనా ఆగేవని అన్నారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ... కేసీఆర్ చైనా టూర్ ఖర్చు, పర్యటన వివరాలు, వచ్చిన పెట్టుబడులపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయించినట్లుగా, ఇక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, చైనా పర్యటన ఏంటంటూ విమర్శించారు. ఏడాది కాలంలోనే 50వేలకోట్ల అప్పులు చేసి, తెలంగాణను దివాళా తీయించారని, అందుకే ప్రపంచ బ్యాంక్ లాస్ట్ ర్యాంక్ ఇచ్చిందని ఆరోపించారు.