తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. కేసీఆర్ హాజరు.. ట్విస్టేంటి?
posted on Jul 23, 2024 @ 11:06AM
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. అంతుకు ముందు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు హాజరుపై ఉత్కంఠ నెలకొని ఉంది. అయితే ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించడంతో.. ఈ సమావేశాలు వాడి వేడిగా సాగడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే గత ఏడాది జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం తరువాత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. రెండు సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగినా దూరంగానే ఉన్నారు. ప్రతిపక్ష నేతగా సభకు హాజరు కావడం ఇష్టం లేకే ఆయన అసెంబ్లీకి రావడం లేదన్న ప్రచారం జరిగింది. గత కొంతకాలంగా ఫామ్ హౌజ్ కు మాత్రమే పరిమితం కావడంతో కేసీఆర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు అయ్యే అవకాశాలు లేవని పరిశీలకులు విశ్లేషించారు. అయితే కేసీఆర్ అసెంబ్లీకి గైర్హాజరైతే బీఆర్ఎస్ ప్రతిష్ఠ మరింత మసకబారుతుందన్న ఆందోళన బీఆర్ఎస్ నేతలు, శ్రేణుల్లో వ్యక్తం కావడంతో కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
కేసీఆర్ అసెంబ్లీలో రేవంత్ సర్కార్ ను ఇరుకున పెట్టడానికి ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది. తెలంగాణ ఆవిర్భావం తరువాత కేసీఆర్ ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి హాజరు కావడం ఇదే తొలి సారి.
ఇలా ఉండగా బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తమకు విడిగా సీటింగ్ ఏర్పాటు చేయాలని స్పీకర్ ను కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. అసెంబ్లీలో బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు పది మంది ఉన్నారు. వీరి ప్రజెన్స్ సహజంగానే కేసీఆర్ ను ఇబ్బంది పెడుతుంది. గతంలో తాను అధికారంలో ఉండగా కేసీఆర్ విపక్ష పార్టీల ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లోకి చేర్చుకున్న సంగతి తెలిసిందే. సో ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఆయన విమర్శలు చేసే అవకాశం లేదు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్లుగా వారి సమాధానం ఉంటుందన్నది తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే అసెంబ్లీలో తాము విడిగా కూర్చేనేందుకు తగిన సీటింగ ఏర్పాట్లు చేయాలని బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన పది మంది ఎమ్మెల్యేలూ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కోరారు.