కేసీఆర్ చచ్చిన పాము.. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ సెన్సేషనల్ కామెంట్స్!
posted on Feb 14, 2024 @ 2:21PM
కాంగ్రెస్ మేడిగడ్డ సందర్శన, బీఆర్ఎస్ నల్గొండ బహిరంగ సభలు వేదికలుగా అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య ఆరంభమైన మాటల యుద్ధం అసెంబ్లీకి చేరింది. అసెంబ్లీలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం మరో రేంజ్ కి చేరింది.
మేడిగడ్డ ఫిల్లర్ల కుంగుబాటు, కాళేశ్వరం బ్యారేజ్ వైఫల్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విపక్ష నేతలను చెరిగి పారేశారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యుడు మాజీ మంత్రి కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ జోక్యం చేసుకున్నారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలకు అభ్యంతరం చెబుతున్న కేటీఆర్ నల్గొండ సభ వేదికగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై, ఆయన వాడిన భాషపై చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ పద్ధతిగా మాట్లాడారా అని నిలదీశారు.
ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా.. బుద్ధి మారలేదంటూ ఫైర్ అయ్యారు. మేడిగడ్డ కుంగిపోతే నీరు నింపడానికి అవకాశం ఉందా? అని ప్రశ్నించిన రేవంత్.. బీఆర్ఎస్ హయాంలో నీటి పారుదల శాఖ చూసిన కేసీఆర్, హరీష్ రావులకు పెత్తనం ఇస్తాం మేడిగడ్డలో నీరు నింపి సుంందిళ్ల, అన్నారంలకు ఎత్తిపోస్తారా? అని సవాల్ విసిరారు. అక్కడితో ఆగకుండా మేడిగడ్డ పిల్లర్లు కుంగి ప్రాజెక్టు కుప్పకూలుతుంటే నీరు నింపడం సాధ్యమేనా అని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు దెబ్బతినడం వల్ల 94 వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయ్యింది వాస్తవం కాదా అన్నారు. ఈ విషయంపై చర్చకు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ సభకు రాకుండా పారరయ్యారని రేవంత్ నిప్పులు చెరిగారు.
కేసీఆర్ సభకు వస్తే ఈ అంశంపై చర్చిస్తామన్నారు. అవసరం అనుకుంటే రేపు సాయంత్రం వరకూ కూడా చ ర్చించడానికి సిద్ధమని చెప్పారు. కేసీఆర్ నల్గొండ ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ.. ఆయనో చచ్చిన పాము.. చచ్చిన పామును చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలోనే కేసీఆర్ అనే పాము చనిపోయిందన్నారు. కేసీఆర్ సభకు వచ్చే ధైర్యం లేదన్న రేవంత్ ఆయన వస్తే కాళేశ్వరంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.