అయ్యో పాపం.. కేసీఆర్ మళ్లీ సెంటిమెంట్ అస్త్రం!
posted on Feb 14, 2024 7:26AM
తెలంగాణలో అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ ఎస్ పార్టీల మధ్య సాగునీటి ప్రాజెక్టుల విషయంలో వార్ తార స్థాయికి చేరింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. బీఆర్ ఎస్ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిని వెలికితీసేందుకు రేవంత్ ఉపక్రమించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగడంపై సీఎం రేవంత్ సహా, కాంగ్రెస్ నేతలు బీఆర్‌ఎస్‌పై ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. కమిషన్ల కక్కుర్తి కోసం నాసిరకంగా మేడిగడ్డను నిర్మించారు.. ఆధారాలతో నిరూపిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల్లోనూ అధికార, విపక్ష పార్టీల సభ్యుల మధ్య ఇదే విషయంపై తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం సాగింది. కాంగ్రెస్ వాదనకు కౌంటర్ గా బీఆర్ ఎస్ సభ్యులు తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నియంత్రణను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్‌ఎంబీ) కి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగించిందని విమర్శలు చేశారు. అదంతా కేసీఆర్ పాపమని, ఎట్టి పరిస్థితుల్లో కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టుల బాధ్యతలు అప్పగించేది లేదని కాంగ్రెస్ ప్రభుత్వం తేల్చి చెప్పేసింది.
మరో రెండు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన బీఆర్ ఎస్.. పార్లమెంట్ లో సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. ఈ క్రమంలో మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాలకు పదును పెడుతున్నారు. అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టుల విషయంపై సుదీర్ఘ చర్చజరుగుతున్నా హాజరు కాని కేసీఆర్.. నల్గొండ జిల్లా వేదికగా బహిరంగ సభ నిర్వహించారు. బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగం ఆసాంతం ప్రజల్లో సెంటిమెంట్ ను రగిల్చే విధంగా సాగింది. ఇప్పట్లో ఎన్నికలు ఏమీ లేవు.. ఇది ఎన్నికల సభ కాదంటూనే.. పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్ గా కేసీఆర్ ప్రసంగం సాగింది. ఒకానొక దశలో.. కేసీఆర్ కంట్రోల్ తప్పి మాట్లాడారన్న భావన పరిశీలకులలోనే కాదు, బీఆర్ఎస్ శ్రేణుల్లోనూ వ్యక్తమైంది. నల్గొండ జిల్లాలో అడుగు పెట్టనివ్వరా.. ఎవర్రా నన్ను ఆపేది.. చంపుతారా.. నన్ను చంపుతారా.. దా వచ్చి చంపు.. అంటూ ఉద్వేగపూరితమైన ప్రసంగం చేయడం ద్వారా కేసీఆర్ ప్రజల్లో సానుభూతిని పొందే ప్రయత్నం చేశారు. అదే సమయంలో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నమూ కేసీఆర్ ప్రసంగంలో కనిపించింది. మీరెవరూ అధైర్యపడొద్దు.. అడుగుడునా ప్రభుత్వాన్ని నిలదీయండి అంటూ కేసీఆర్ పిలుపునిచ్చారు.
రెండు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో అధికారాన్ని కోల్పోయిన కేసీఆర్.. పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని పట్టుదలతో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత.. ఇన్నాళ్లు బీఆర్ ఎస్ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, బీఆర్ ఎస్ పార్టీ ముఖ్య నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు బీఆర్ ఎస్ ను వీడేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి తోడు బీఆర్ ఎస్ పార్టీ పట్టును నిలుపుకోవాలంటే పార్లమెంట్ లో గతంలో కంటే అత్యధిక స్థానాల్లో విజయం సాధించాలని కేసీఆర్ భావిస్తున్నారు. అయితే ప్రజల్లో మాత్రం బీఆర్ ఎస్ పై వ్యతిరేకత ఉండటం కేసీఆర్ ను కలవరపాటుకు గురిచేస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రభుత్వం పట్ల ప్రజాదరణ పెరగడం కేసీఆర్ ను ఆందోళనకు గురిచేస్తున్నది.
రోజు రోజుకు ప్రజాదరణ పొందుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పార్లమెంట్ ఎన్నికల్లో బలంగా ఢీకొట్టాలంటే ప్రజల్లో సెంటిమెంట్ రగల్చడంతో పాటు సానుభూతిని పొందాలని కేసీఆర్ భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. నల్గొండ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగం చూస్తే ఇదే విషయం అర్థమవుతున్నది. స్పష్టంగా చెప్పాలంటే.. వచ్చే పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ ఎస్ పార్టీకి జీవన్మరణ సమస్య. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ ఎస్ పార్టీ విఫలమైతే .. ఆ పార్టీ మనుగడ ప్రశ్నార్థకమౌతుందని కేసీఆర్ ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తోంది. దీంతో ప్రజల్లో సానుభూతి పొందడంతోపాటు, సెంటిమెంట్ రెచ్చగొట్టడం ద్వారా పార్లమెంట్ ఎన్నికల నాటికి వారిని బీఆర్ ఎస్ వైపు తిప్పుకోవాలన్నది కేసీఆర్ ప్లాన్ గా కనిపిస్తోంది. బీఆర్ఎస్ కు బలమైన ఆయుధం లాటి తెలంగాణ పేరును పార్టీ నుంచి తొలగించేసిన కేసీఆర్ ఇప్పుడు ఆ సెంటిమెంట్ కోసం వెంపర్లాడుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే జనం మాత్రం సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛలను కోరుకుంటున్నారంటున్నారు. మరి కేసీఆర్ సానుభూతి, సెంటిమెంట్ అస్త్రం పార్లమెంట్ ఎన్నికల్లో ఏమేరకు పనిచేస్తుందో వేచి చూడాల్సిందే.