లేటెస్ట్ హెల్త్ అప్ డేట్.. పిల్లలలో కరోనా తో పాటు కొత్తగా కావసాకి సిండ్రోమ్..
posted on Aug 10, 2020 9:28AM
కరోనా తో ప్రపంచం అల్లాడిపోతున్న సంగతి తెలిసిందే. ఐతే తాజాగా కరోనా వైరస్ సోకిన పిల్లలకు కొత్తగా కావసాకి సిండ్రోమ్ (MIS-C) బయట పడుతోంది. తాజాగా అమెరికాలోని 600 మంది పిల్లలు ఒక అరుదైన అనారోగ్యంతో ఆస్పత్రుల్లో చేరారు. ఆ పిల్లలందరికీ జ్వరం, చర్మంపై దద్దుర్లు వంటివి వచ్చాయి. దీంతో టెస్ట్ చేసిన డాక్టర్లు వారికీ కరోనా సోకిందని తేల్చారు. ఐతే ఆ పిల్లలలో ఈ కొత్త లక్షణాలకు కారణం కావసాకి సిండ్రోమ్ లేదా మల్టీసిస్టం ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ (MIS-C) అని తేల్చారు. ఈ సిండోమ్ కు కారణం కరోనా వైరస్ అని కూడా డాక్టర్లు తేల్చారు. ఇది సోకిన పిల్లలకు జ్వరం, చర్మంపై దద్దుర్లు వంటివి వస్తాయి. కొన్ని సందర్భాలలో అరుదుగా గుండె మంట కూడా వస్తుంది. కరోనా వైరస్ సోకిన 2 నుంచి 4 వారాల తర్వాత పిల్లలో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి.
మే నెలలో అమెరికాలో మొదటి MIS-C కేసు బయటపడింది. దీంతో అమెరికాలోని వ్యాధుల నియంత్రణ, చర్యల సంస్థ (CDC)అప్రమత్తమై ఇలాంటి కేసులు ఎక్కడొచ్చినా తనకు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. గత నెల జులై 29 నాటికి దాదాపు 570 (MIS-C) కేసులు నమోదయ్యాయి. ఈ సిండ్రోమ్ బారిన పడిన వాళ్లందరికీ కరోనా వైరస్ సోకింది. అంతే కాకుండా వాళ్లలో 10 మంది చనిపోయారు. తాజాగా ఇటువంటి కేసులు అమెరికాతో పాటూ ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్ లోకూడా నమోదైనట్లుగా తెలుస్తోంది. ఐతే ముందుగానే గుర్తిస్తే ఈ కొత్త సిండ్రోమ్ నుండి పిల్లల్ని కాపాడవచ్చని CDC తెలిపింది. అంతే కాకుండా దీనిపై డాక్టర్లు అప్రమత్తంగా ఉండాలని కోరింది.
మరో పక్క ఇండియాలో కూడా ఇటువంటి లక్షణాలతో ఉన్న కొంత మంది పిల్లలకు గత నెల జులైలో ట్రీట్ మెంట్ ఇచ్చినట్లుగా ముంబై, ఢిల్లీలోని కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రకటించాయి. కరోనా సోకి, నయమైన పిల్లలను తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనించాలని, వారికీ మళ్లీ జ్వరం తిరగపెడితే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు.