మీ రాజకీయాలు తగలెయ్య.. నా కూతుర్ని కాపాడండయ్యా!
posted on May 25, 2024 @ 5:36PM
కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత తీహార్ జైలుకు వెళ్ళి రెండు నెలలు దాటిపోయింది. కవిత ఎన్నిరకాల కారణాలు చెప్పి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నా ఎప్పటికప్పుడు వినాయకుడి పెళ్ళిలాగా వాయిదా పడుతూనే వుంది. అంతేకాకుండా.. పురుగుమీద పుట్రలాగా ఈడీ కేసుకు తోడు, సీబీఐ కేసు కూడా చేరి మూలిగే అక్క మీద తాటికాయ పడ్డట్టుగా పరిస్థితి మారింది. తల్లి దగ్గర లేకుండానే కవిత పిల్లల పరీక్షలు ముగిశాయి. బీఆర్ఎస్‌కి స్టార్ కాంపైనర్ లేకుండానే ఎలక్షన్లు ముగిశాయి. తెలంగాణ ప్రజలు కవిత అనే ఒక కేరెక్టర్ వుంది అనే విషయం కూడా మెల్లగా మర్చిపోతున్నారు. ఈడీ, మోడీ, బోడి ఎవరొచ్చినా మమ్మల్నేమీ చేయలేరు... మా జోలికి వస్తే తెలంగాణ సమాజం మొత్తం తిరగబడుతుంది. మీద పడి రక్కుతుంది అని బిల్డప్పు ఇచ్చుకున్న కవితను ప్రస్తుతం జనం ఎంతమాత్రం పట్టించుకోవడం లేదు. మందుబాబులు మందు కొట్టడం ఎంతమాత్రం మానలేదు.. అరె.. మన మందు కోసం కవితమ్మ జైల్లోకి వెళ్ళింది కదా.. ఆమెకి మద్దతుగా మందు కొట్టడం ఆపేద్దాం అని ఎవరూ అనుకోవడం లేదు. తెలంగాణ జనం కవిత అరెస్టుని లైట్‌గా తీసుకున్నారు.. ఓకే.. కవితని జనం పట్టించుకోకపో్తే పట్టించుకోకపోయారు.. వాళ్ళ బాధలు వాళ్ళకున్నాయి. చివరికి కవిత తండ్రి కేసీఆర్, కవిత అన్న కేటీఆర్ కూడా కవిత అరెస్టుని లైట్‌గా తీసుకున్నట్టు అనిపిస్తోంది.
ఢిల్లీలో చక్రం తిప్పుతా, నేను లేస్తే మనిషిని కాదు అన్నట్టుగా మాట్లాడిన కేసీఆర్, తన కుమార్తెని విడిపించుకునే విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు తప్ప, కవితని విడిపించడానికి రాజకీయంగా చాణక్యం ఏదైనా చేయాలన్న ఆలోచనలో ఆయన ఉన్నట్టులేరు. ఆయన వ్యవహార శైలి చూస్తుంటే, అసలు తన కూతురు అరెస్టు కాలేదు అన్నట్టుగానే వుంది. మరోవైపు కేటీఆర్ అయితే, పాపం ఆయనకి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అర్జెంటుగా ఎలా కూలదోయాలా అన్న ఆలోచనలోనే వున్నారు తప్ప, తోబుట్టువును బయటకి తీసుకురావడానికి తన తండ్రి మీద ఒత్తిడి తేవాలన్న ఆలోచనలో ఉన్నట్టులేరు. ఇక హరీష్‌రావుకి, గానీ సంతోష్‌రావుకి గానీ కవిత జైల్లో వుండటం పెద్ద బాధ కలిగించే విషయం కాదు. వీళ్ళంతా కవిత విషయంలో చాలా రిలాక్స్.గా వున్నారు. కానీ, ఒక్క మనిషి మాత్రం కవిత అరెస్టు అయినప్పటి నుంచి కుమిలిపోతూ వున్నారు. ఆమె ఎవరో కాదు.. కవిత మాతృమూర్తి శోభ!
అల్లారుముద్దుగా పెంచిన కన్న కూతురు జైల్లో వుంటే, ఇటు భర్త, అటు కొడుకు ఇద్దరూ కవితని విడిపించడానికి రాజకీయంగా ఏం చేయాలన్నది ఆలోచించకుండా మళ్ళీ అధికారంలోకి ఎలా రావాలా అనే ఆలోచిస్తూ వుండటం ఆమెకు ఎంతమాత్రం నచ్చడం లేదని తెలుస్తోంది. ఇద్దర్నీ ఎంత బతిమాలినా కొంచెం వెయిట్ చెయ్యి, పరిస్థితులు అన్నీ అవే సర్దుకుంటాయి అని చెబుతున్నారట. ఎంత ఒత్తిడి చేసినా ఎలక్షన్లు అయ్యాక పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా మారతాయి. అప్పుడు కవితని విడిపించడం ఈజీ అవుతుందని చెబుతూ ఆమెని శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నారట. ఆమె మాత్రం జైల్లో కూతురు ఎలా వుందో, ఎన్ని బాధలు పడుతోందో అని మనోవేదనతో కుమిలిపోతూ వున్నట్టు సమాచారం.