బతకలేకపోతే చావండి.. పేదలపై రెచ్చిపోయిన మంత్రి
posted on Apr 29, 2021 @ 10:24AM
దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. ప్రజలు ప్రాణభయంతో బతుకున్నారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు పేదలకు ఉపాధి పోతోంది. ప్రజలను ఆసరగా నిలిచేందుకు ప్రభుత్వాలు రేషన్ ను ఉచితంగా ఇస్తున్నాయి. కర్ణాటకలో ప్రస్తుతం లాక్ డౌన్ అమలవుతోంది.
అయితే ప్రజలకు ఉచితంగా ఇవ్వాల్సిన ఐదు కిలోల బియ్యం స్థానంలో కర్ణాటక ప్రభుత్వం గోధుమలు, జొన్నలు జోడించి బియ్యాన్ని రెండు కిలోలకు తగ్గించింది. ప్రస్తుతం అక్కడ లాక్‌డౌన్ అమల్లో ఉండడంతో రెండు కిలోల బియ్యం ఎటూ సరిపోవని, మునుపటిలానే ఐదు కేజీల బియ్యం ఇవ్వాలని గదగ జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఆందోళనకారుల్లో ఒకరైన ఈశ్వర ఆర్య నిన్న ఆహార, పౌరసరపరాల మంత్రి ఉమేశ్ కత్తికి ఫోన్ చేసి తమ గోడు వినిపించారు.రెండు కిలోల బియ్యం తమకు ఏమాత్రం సరిపోవని, ఐదు కిలోలు ఇవ్వకుంటే తాము బతకలేమని చెప్పారు. దీనికి మంత్రి స్పందిస్తూ.. ‘‘బతకలేకపోతే చావండి.. అదే మంచిది. మేం మాత్రం అంతే ఇస్తాం’’ అని దురుసుగా సమాధానం ఇచ్చారు.
తనకు ఫోన్ చేసిన వ్యక్తితో మంత్రి ఉమేశ్ కత్తి మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి. మంత్రి తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. రాజకీయ తీవ్ర దుమారం రేపాయి. దీంతో స్పందించిన మంత్రి తాను అలా మాట్లాడిన మాట వాస్తవమేనని అంగీకరిస్తూ క్షమాపణలు చెప్పారు.