కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు
posted on May 5, 2013 @ 10:13AM
నేడు కర్ణాటకలో ఎన్నికలు జరుగబోతున్నాయి. మరో మూడు రోజుల తరువాత ఫలితాలు కూడా వెలువడనున్నాయి. ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి కొంచెం అనుకూల వాతావరణం కనబడుతోంది. కానీ, కేంద్రంలో వరుసపెట్టి బయటపడుతున్న కుంభ కోణాలు ఆ సానుకూల పరిస్థితిని తారుమారు చేసినా చేయవచ్చును. రాష్ట్రంలో ప్రచారానికి వచ్చిన మోడీ, అద్వానీ, సుష్మా స్వరాజ్, వెంకయ్య నాయుడు వంటి బీజేపీ అగ్రనేతలందరూ కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని కాంగ్రెస్ విజయావకాశాలను తగ్గించే ప్రయత్నం చేసారు. కానీ వారి ప్రయత్నాలు ఎంతవరకు సఫలం అయ్యాయో మరో మూడు రోజుల్లో తేలిపోతుంది.
ఇక, కర్ణాటకలో కనుక కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీ సాదిస్తే, అదే ఊపులో పక్కనున్న ఆంధ్ర రాష్ట్రంలో కూడా ముందస్తు ఎన్నికలకి వెళ్లాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు ఊహాగానాలున్నాయి. అందుకు తగిన కారణాలు కూడా ఉన్నాయి.
ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి జైల్లోంచి విడుదలయ్యే పరిస్థితి లేదు గనుక బలహీనంగా ఉన్న ఆ పార్టీని ఇటువంటప్పుడే ఎదుర్కోవడం చాలా తేలికని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక తెలంగాణా ఉద్యమాలు పూర్తిగా చల్లారిపోవడంతో తెలంగాణా జిల్లాలలో ప్రజలు కేసీఆర్ పై నమ్మకం కోల్పోయి ఉన్నారు. గనుక సందిగ్ధంలో ఉన్న వారి ఓట్లు కొల్లగొట్టేందుకు ఇదే మంచి తరుణమని కాంగ్రెస్ భావిస్తోంది.
ఇతర పార్టీల నేతల చుట్టూ తిరుగుతున్న కేసీఆర్, తెరాసలో పోటీ చేసేందుకు బలమయిన అభ్యర్ధులు లేరనే విషయాన్నీ స్వయంగా చాటింపు వేసుకొన్నట్లు అయింది. అందువల్ల తెరాసను ఇటువంటి బలహీన పరిస్థితుల్లో ఉన్నపుడే ఓడించడం సులువవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక,
చంద్రబాబు పాదయాత్ర వల్ల తెలుగుదేశం పార్టీ మళ్ళీ కొంచెం బలం పుంజుకొన్నపటికీ, అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్న ఆ పార్టీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలను ఎదుర్కోలేదని కాంగ్రెస్ భావిస్తోంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ వ్యతిరేఖ వైఖరి స్పష్టంగా కనబడుతున్నపటికీ, సర్వే రిపోర్టులు కూడా పార్టీకి వ్యతిరేఖంగా ఉన్నపటికీ, ప్రతిపక్షాల బలహీనంగా ఉన్న ఈ సమయంలోనే ముందస్తు ఎన్నికలకి వెళ్ళినట్లయితే పార్టీకి కొంతలో కొంతయినా మేలు కలుగుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు, ముటా తగాదాలు ఆ పార్టీకి కొత్తేమి కాదు గనుక, మున్ముందు మరిన్ని కుంభకోణాలు బయటపడక ముందే, ఈ మాత్రం సానుకూలంగా ఉన్న తరుణంలో ఎన్నికలకి వెళ్ళడమే మేలని కాంగ్రెస్ భావిస్తోంది.
కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుక భారీ మెజార్టీ తో విజయం సాదిస్తే బహుశః ఆంధ్ర రాష్ట్రంలో కూడా ముందస్తు ఎన్నికలకి వెళ్ళే ఆలోచన చేయవచ్చును.