కార్గిల్ విజయానికి నేటికి పదిహేనేళ్ళు!
posted on Jul 25, 2014 @ 3:36PM
కార్గిల్ విజయానికి ఈ రోజుతో 15 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. పదిహేనేళ్ళ క్రితం జూలై 26వ తేదీన కార్గిల్‌లో భారత సైన్యం త్రివర్ణ పతాకం ఎగురవేసింది. కార్గిల్ యుద్ధం సందర్భంగా ప్రపంచంలోనే ఎత్తయిన ఈ ప్రాంతంలో భారత, పాకిస్థాన్ దేశాలు హోరాహోరీగా తలపడ్డాయి. కొంత భారత భూభాగాన్ని ఆక్రమించుకున్న పాకిస్థాన్ సైనికులను భారత సైనిక దళాలు తరిమికొట్టాయి. ఆ సమయంలో కార్గిల్ ప్రాంతాన్ని భారత్ కోల్పోయినట్టయితే అది భారతీయులందరికీ గుండెకోతను మిగిల్చి వుండేది. లఢక్ లాంటి ప్రాంతాలు పాకిస్థాన్ సొంతం అయిపోయి వుండేవి. ఆ దారుణం జరగకుండా వుండటానికి భారత సైనికులు వీరోచితంగా పోరాడారు. ఈ యుద్దంలో 537 మంది భారతీయ సైనికులు అమరవీరులయ్యారు. 1363 మంది సైనికులు గాయపడ్డారు. రెండు విమానాలు, ఒక హెలీకాప్టర్‌లను నష్టపోయాం. ఒక జవాను శత్రువు చేతిలో ఖైదీగా చిక్కాడు. ఇక అటువైపు పాకిస్థాన్‌కి చెందిన 453 మంది చనిపోయారు. 665 మంది గాయపడ్డారు. ఎనిమిది మంది బందీలుగా చిక్కారు. కొండ పైకి ఎగబాకి యుద్ధం చేయాల్సి రావడంతో మనకు ఎక్కువ నష్టం సంభవించింది. ఫలితంగా ఎంతో మంది సైనిక వీరులను కోల్పోవాల్సి వచ్చింది. అయినప్పటికీ భారతదేశం వైపు వక్రబుద్ధితో చూస్తే తగిన శాస్తి తప్పదన్న గుణపాఠాన్ని పాకిస్థాన్‌కి ఇవ్వగలిగాం.