కన్హయ్య కేసులో కొత్త ట్విస్ట్.. మార్ఫింగ్ వీడియోనా..?
posted on Feb 20, 2016 @ 10:41AM
దేశ దోహిగా ఆరోపణలు మోస్తున్న కన్హయ్య కుమార్ వ్యవహారంలో రోజుకో కొత్త విషయం బయడపడుతోంది. ఇప్పటి వరకూ కన్హయ్య కుమార్ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాడంటూ.. అతనిని దేశ ద్రోహి అంటూ పలువురు అతనిపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ఆధారం ఒక వీడియో. జమ్మూ కాశ్మీర్‌కు స్వేఛ్చ కావాలంటూ పెద్దఎత్తున, ఆవేశంగా నినాదాలు చేస్తున్న కన్నయ్యకుమార్ విడియో కొద్దిరోజులుగా విస్తృతంగా ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ వీడియో మార్ఫింగ్ చేసిందని తేలింది. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం మరింత రసవత్తరంగా మారింది. ప్రముఖ ఎబిపి, ఇండియా టుడే ఛానళ్లు విడివిడిగా చేసిన పరిశోధనల్లో ఈ విషయం తేలినట్టు తెలుస్తోంది.
అసలు సంగతేంటంటే.. జెఎన్‌యులో ఈ నెల 9వ తేది ఒక కార్యక్రమం జరగగా అందులో కొందరు దేశ వ్యతిరేక నినాదాలు చేశారు. అయితే, ఆ కార్యక్రమంలో చొరబడిన కొందరు ఎబివిపి విద్యార్థులు కూడా దేశ వ్యతిరేక నినాదాలు చేశారని, మరుసటి రోజు ఎబివిపి నిర్వహించిన కార్యక్రమంలో సైతం వారు ఉన్నారని ఫోటోలతో సహా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా 11 వ తేది విశ్వవిద్యాలయ ఆవరణలో జరిగిన మరో కార్యక్రమంలో కన్నయ్యకుమార్ పాల్గొన్నాడు. ఈ రెండు కార్యక్రమాల వీడియోని తీసి దానిని మార్ఫింగ్ చేసి వీడియోని చేశారని తాజా పరిశోధనల్లో తెలిసింది.
మరోవైపు పోలీసులు ఈ వీడియో ఆధారంగానే కన్హయ్యను అరెస్ట్ చేశారు. అంతేకాదు పలు పార్టీ నేతలు కూడా ఈ వీడియో ఆధారంగానే కన్హయ్యపై విమర్శలు గుప్పించారు. మరి వీడియో ఆధారంగానే కన్హయ్యను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఇంత కీలకమైన ఈ వీడియో మార్ఫింగ్ అంటే నమ్ముతారా.. మరి ఏం జరుగుతుందో చూడాలి..