కందుకూరులో మాటలకందని విషాదం
posted on Dec 28, 2022 @ 10:21PM
కందుకూరులో తెలుగుదేశం నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో విషాదం చోటు చేసుకుంది. తెలుగుదేశం అధినేత హాజరైన ఈ కార్యక్రమానికి జనం అనూహ్యంగా పోటెత్తారు. నెల్లూరు జిల్లా కందుకూరులో తెలుగుదేశం ఇంత వరకూ కేవలం రెండు సార్లు మాత్రమే విజయం సాధించింది. కందుకూరులో చంద్రబాబు రోడ్ షో ప్రపంగం ప్రారంభించారు. ఆ ప్రాంత మంతా జై చంద్రబాబు, జై తెలుగుదేశం నినాదాలతో మార్మోగింది. చంద్రబాబు ఉద్వేగపూరితంగా ప్రసంగిస్తున్నారు. తన ప్రసంగం మధ్యలో ఆయన అక్కడ కాల్వ ఉంది జాగ్రత్త అని హచ్చరించారు కూడా.. అంతలోనే అనూహ్య దుర్ఘటన జరిగింది. బైకులపై కూర్చుని చంద్రబాబు ప్రసంగం వింటున్న వారు వాహనాలతో సహా కాలువలో పడిపోయారు. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది మరణించారు. మరో పది మంది వరకూ గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
చంద్రబాబు ఆసుపత్రికి వెళ్లి వారందరినీ పరామర్శించారు. నేనున్నా భయపడవద్దని ధైర్యం చెప్పారు. మీ కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను కోరారు. అనంతరం మృతుల కుటుంబాలకు, ఒక్కొక్కరికి పదిలక్షల నష్టపరిహారం ప్రకటించారు.మృతుల పిల్లలను ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా చదివిస్తామని హామీ ఇచ్చారు. వారిని దగ్గరుండి చూసుకోవాలని పార్టీ నేతలను ఆదేశించారు.
మాజీ ఎమ్మెల్యే దివి శివరాం, ఇంటూరి రాజేష్, ఇంటూరి రాజేష్ బాధితులకు దగ్గరుండి సహాయ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు. కాగా తర్వాత జరగాల్సిన కావలి సభను రద్దు చేసుకున్నారు. కందుకూరు దుర్ఘటనలో మరణించిన కార్యకర్తల అంత్యక్రియలకు పార్టీ ఇన్‍చార్జ్ లు, ఎమ్మెల్యేలు వెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశించారు. ఒక్కో ఇన్‍చార్జ్ ఒక్కొక్క కార్యకర్త మృతదేహం వెంట వెళ్లి.. అంత్యక్రియలు పూర్తయ్యేవరకు కుటుంబసభ్యులతో ఉండాలని ఆదేశించారు
మరణించిన కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించడంతో పాటు కుటుంబసభ్యులకు మనోధైర్యం కల్పించాలని చంద్రబాబు చెప్పారు. కందుకూరులో జరిగిన విషాదంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, బీద రవిచంద్ర, ధూళిపాళ్ల నరేంద్ర, నక్కా ఆనంద్‌బాబు తదితరులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అలాగే తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ కందుకూరు దుర్ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులకు ఆయన సంతాపం ప్రకటించారు. మృతుల ఆత్మ కు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.