ఆసుపత్రిలో చేరిన కమల్.. కారణమేమిటంటే?
posted on Nov 24, 2022 8:25AM
సుప్రసిద్ధ నటుడు కమల్ హసన్ అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. ఈ వార్త ఆయన అభిమనాలల్లో కలవరం నింపింది. కమల్ హసన్ ఆరోగ్యం నిలకడగానే ఉందనీ, ఖంగారు పడాల్సిందేమీ లేదనీ, గురువారం(నవంబర్ 24) డిశ్చార్జ్ చేస్తామనీ వైద్యులు తెలిపారు.
చాలా కాలం పాటు సరైన హిట్ లేక వెనుకబడిన కమల్ హసన్ ఇటీవలె విక్రమ్ సినిమాతో భారీ హిట్ కొట్టారు. దీంతో ఆయనతో సినిమాలు తీయడానికి నిర్మాతలు క్యూ కట్టారు. కమల్ హసన్ కూడా పలు ప్రాజెక్టులతో బిజీ అయినట్లు చెబుతున్నారు.
విక్రమ్ సినిమా దాదాపు 400 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ హిట్ గా నిలవడంతో కమల్ హసన్ ఫుల్ జోష్ మీద ఉన్నారు. కాగా ఆయన బుధవారం(నవంబర్ 23) హైదరాబాద్ వచ్చి కళాతపస్వి విశ్వనాథన్ తో భేటీ అయ్యారు. ఇదేమైనా కథా చర్చల్లో భాగమా లేక మర్యాదపూర్వక భేటీయా అన్నది పక్కన ఉంచితే.. సాగర సంగమం, స్వాతి ముత్యం వంటి గొప్ప సినిమాలు వీరి కలయికలో వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే కమల్ హసన్, విశ్వనాథ్ ల బేటీ సినీ వర్గాలలో ప్రాధాన్యత సంతరించుకుంది. విశ్వనాథ్ తో భేటీ తరువాత చెన్నై వెళ్లిన కమల్ హసన్ అస్వస్థతకు గురై ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. కమల్ హసన్ జ్వరంతో బాధపడుతున్నారనీ, అంతకు మించి మరే అనారోగ్యం లేదనీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆయనను గురువారం డిశ్చార్జ్ చేయనున్నట్లు పేర్కొన్నాయి.