కాళేశ్వరం తెలంగాణకు వరం కాదు.. భారం.. తేల్చేసిన కాగ్!
posted on Feb 15, 2024 @ 2:52PM
కాళేశ్వరం ప్రాజెక్టును అవినీతి, అక్రమాల పుట్టగా కాగ్ తేల్చేసింది. ఈ ప్రాజెక్టుపై కాగ్ నివేదికను కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ప్రాజెక్టు వ్యయం 38వేల 500 కోట్ల రూపాయలు అయితే రీ ఇంజినీరింగ్ పేరిట దీనిలో ప్రాణహిత ప్రాజెక్టును కూడా కలిపేసీ కేసీఆర్ సర్కార్ ప్రాజెక్టు వ్యయాన్ని భారీగా పెంచేసిందని కాగ్ స్పష్టం చేసింది. కాళేశ్వరం వల్ల తెలంగాణకు పెను భారమే కానీ పైసా ప్రయోజనం ఉండదని..పైగా వేల కోట్లలో అక్రమాలు జరిగాయని కాగ్ తేల్చింది.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ రిపోర్ట్‌ను అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రాజెక్టు అంచనా వ్యయం 38 వేల 500 కోట్లు. అయితే.. రీ-ఇంజనీరింగ్ సమయంలో కాళేశ్వరం, ప్రాణహిత ప్రాజెక్టులు రెండింటికీ కలిపి 85 వేల 651.81 కోట్లు ఖర్చు అవుతుందని అప్పటి కేసీఆర్ సర్కార్ అంచనాలు పెంచేసింది. వాస్తవానికి రీ-ఇంజనీరింగ్ కారణంగానే ఈ ప్రాజెక్టు వ్యయం 122 శాతం మేర పెరిగిందని కాగ్ కుండబద్దలు కొట్టింది. అయితే వ్యయం భారీగా పెరిగినా ఆయకట్టు మాత్రం పెద్దగా పెరగలేదని పేర్కొంది. రీ ఇంజినీరింగ్ తరువాత కూడా ప్రాజెక్టులో మార్పులు చేర్పుల పేరుతో ప్రాజెక్టు వ్యయాన్ని భారీగా పెంచేశారని తేల్చింది. అయితే వ్యయాన్ని అయితే పెంచేశారు కానీ సాగులోకి వచ్చే ఆయుకట్టలో మాత్రం పెరుగుదల లేదని ఎత్తి చూపింది.
రీ-ఇంజనీరింగ్ తర్వాత లిఫ్టులను నడపడానికి అయ్యే వార్షిక విద్యుచ్ఛక్తి, అలాగే విద్యుత్ వినియోగానికి అయ్యే వ్యయం కూడా భారీగా పెరిగిపోయిందనీ, అంతే కాకుండా ప్రాజెక్టు కోసం భారీగా రుణాలు సేకరించారనీ, అలాగే గ్రాంట్ల మళ్లింపు కూడా చేశారనీ కాగ్ నివేదిక విస్పష్టంగా పేర్కొంది. ప్రాజెక్టు పనులలో కొన్నిటికి అధిక బిల్లులు చెల్లించారనీ, అలాగే రికార్డులను కూడా సకాలంలో సమర్పించలేదని కాగ్ వివరించింది. కాళేశ్వరం విషయంలో ప్రతీ అంశంలోనూ తప్పులు జరిగాయని కాగ్ నివేదిక కుండబద్దలు కొట్టింది.
కాళేశ్వరం అవినీతిపై కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాళేశ్వరానికి అనుబంధంగా ఉన్న మేడిగడ్డ కుంగుబాటు. భారీ వర్షాలకు కాళేశ్వరం పంప్ హౌజ్ ల మునక వంటి అంశాలను ఎత్తి చూపుతూ ఆ ప్రాజెక్టు రూపకల్పన నుంచీ అన్నీ తప్పుల తడకలేనని కాంగ్రెస్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కాగ్ కూడా కాళేశ్వరం తప్పులను ఎత్తి చూపడంతో కాంగ్రెస్ ఏం చర్యలు తీసుకోనున్నదన్న ఆసక్తి, ఉత్కంఠ సర్వత్రా వ్యక్తం అవుతోంది.